పల్లెల్లో దళితకాలనీలను చుట్టేస్తున్న కలెక్టర్ గౌతమ్
రోజూ ఉదయం 3 గంటలపాటు ఎస్సీ కాలనీల్లో పర్యటన
అధికారులంతా దళిత కాలనీల సర్వేలతో బిజీబిజీ
కలెక్టరే ఇంటికి రావడంతో ఆనందిస్తున్న కాలనీవాసులు
చింతకాని, మార్చి 18 : దళితబంధు పథకం అమలు కోసం ముమ్మర సర్వేలు కొనసాగుతుండడంతో మండలంలోని అన్ని గ్రామాల్లోనూ పండుగ వాతావరణం నెలకొంది. దళితుల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన దళితబంధు పథకం పైలట్ ప్రాజెక్టుగా చింతకాని మండలం ఎంపికైన విషయం విదితమే. ఈ క్రమంలో ఆ మండలంలోని అన్ని గ్రామాల్లోనూ సర్వే ప్రారంభం కావడంతో కాలనీల్లో పండుగ వాతావరణం సంతరించుకుంది. ఇప్పటికే దళిత సంఘాల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేస్తున్నారు. మండలాధికారులు 26 గ్రామాల్లో ఇంటింటికీ వెళ్తూ లబ్ధిదారుల వివరాలు సేకరించే పనిలో బిజీబిజీగా ఉన్నారు. ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ ఇప్పటికే తన బిజీ షెడ్యూల్ను పక్కన బెట్టి దళితబంధు పథకంపై ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామాల్లోని దళిత కాలనీల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇప్పటికే ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, మండల అధికారులు గ్రామాల వారీగా పర్యటిస్తూ ఎస్సీల సామాజిక, ఆర్థిక స్థితిగతుల గురించి తెలుసుకుంటున్నారు.
దళితకాలనీల్లో రోజూ 3 గంటలు..
మండలంలోని ప్రొద్దుటూరు, నాగిలిగొండ, కోమట్లగూడెం, సీతంపేట, చిన్నమండవ, వందనం, రామకృష్ణాపురం, నేరడ తదితర గ్రామాల్లోని దళితకాలనీల్లో ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ రోజూ పర్యటిస్తున్నారు. ఉదయం 8 గంటలకే కాలనీల్లోకి వస్తున్న ఆయన.. సుమారు 3 గంటల సమయం వెచ్చించి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్తున్నారు. వారి నైపుణ్యాలు తెలుసుకుంటూ, యూనిట్లపై సూచనలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. సాక్షాత్తూ కలెక్టరే తమ ఇంటికి వచ్చి అవగాహన కల్పిస్తుండడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా కలెక్టరే వచ్చి లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తుండడంతో అధికారులు, ప్రజాప్రతినిధుల సైతం మరింత బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. లబ్ధిదారులకు వ్యాపార మెళకువల గురించి వివరిస్తున్నారు. మండలంలో 26 గ్రామాలకు గాను 25 మంది జిల్లా స్థాయి ప్రత్యేకాధికారులు సెలవు రోజుల్లోనూ సర్వే చేస్తూ ధ్రువపత్రాలు, బ్యాంకు ఖాతాలు జారీ చేస్తున్నారు.
ఎక్కువగా ఆసక్తి కనబరిచే యూనిట్లు..
డెయిరీ ఫాం, ప్రజా, సరుకు రవాణా వాహనాలు, వ్యవసాయ యంత్ర పరికరాలు, పౌల్ట్రీ, ఇటుకల తయారీ కేంద్రాలు, ఎరువులు, పురుగుమందుల దుకాణాలు, రక్త పరీక్షా కేంద్రాలు, మెడికల్ షాపులు, బార్లు, వివిధ మిల్లులు, ఎలక్ట్రానిక్స్, హార్డ్వేర్ దుకాణాలు, సెంట్రింగ్, కాంక్రీట్ మిశ్రమ తయారీ యంత్రాలు, హోటళ్లు, మినీ సూపర్బజార్లు, స్టోర్స్, డీటీపీ, మీసేవా, ఆన్లైన్ సెంటర్లు, ఫొటో స్టూడియోలు, భవన నిర్మాణ సామగ్రి, మద్యం దుకాణాల వంటి వ్యాపారాలపై ఎక్కువమంది లబ్ధిదారులు ఆసక్తి కనబరుస్తున్నారు. యూనిట్లు ఎక్కడైనా ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం వీలు కల్పించడంతో చాలా మంది లబ్ధిదారులు కూతవేటు దూరంలోనే ఉన్న జిల్లా కేంద్రంవైపు చూస్తున్నారు. లబ్ధిదారుల గత, ప్రస్తుత నైపుణ్యాల గురించి తెలుసుకొని ఎలాంటి యూనిట్లు నెలకొల్పాలో అధికారులు సూచనలు చేస్తున్నారు.
మీసేవా కేంద్రాలు కిటకిట..
మండలంలోని మీసేవా కేంద్రాలన్నీ లబ్ధిదారులతో కిటకిటలాడుతున్నాయి. ఇప్పటి వరకు కుల ధ్రువీకరణ పత్రాలు తన పేరిట లేని వారంతా దరఖాస్తు చేసుకునేందుకు మీసేవా కేంద్రాలకు పరుగెత్తుతున్నారు. బ్యాంకర్లు సైతం ఆయా గ్రా మాలకే వెళ్లి లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాలు తెరుస్తున్నారు. తహసీల్దార్ జారీ చేసే కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు, ఆహార భద్రత, ఆధార్, ఓటరు గుర్తింపు కార్డుల వంటివి లబ్ధిదారుల వద్ద ప్రాథమికంగా ఉండాలి. పాస్పోర్టు సైజు ఫొటోలు, ఫోన్ నెంబర్ ఉండాలి.