బడ్జెట్లో రూ.వెయ్యి కోట్ల ప్రకటన హర్షణీయం
2025 నాటికి అందుబాటులోకి కొత్త ఫ్యాక్టరీలు
ఆయిల్‌పామ్ సాగు విస్తరణపై ప్రత్యేక దృష్టి
ఆయిల్‌ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి
అశ్వారావుపేట, మార్చి 18: భవిష్యత్తులో రైతులకు ఆయిల్‌పాం మొక్కల కొరత రానివ్వబోమని ఆయిల్‌ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. రైతుల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఏడాది సరిపడినన్ని మొక్కలు పంపిణీ చేయలేకపోయామని అన్నారు. అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీని శుక్రవారం సందర్శించిన ఆయన.. పామాయిల్ ఫ్యాక్టరీ పనితీరును పరిశీలించారు. గెలల నాణ్యతను తనిఖీ చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2019 జూలై నుంచి 2022 మార్చి వరకు ఉమ్మడి జిల్లాలో 20 వేల ఎకరాలకు మొక్కలు పంపిణీ చేయాల్సి ఉన్నదని, వాటిని 2023 మార్చి నాటికి రైతులకు పంపిణీ చేయనున్నామని తెలిపారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా గద్వాల్, సిద్దిపేట, తొర్రూరు ప్రాంతాల్లో కొత్త ఫ్యాక్టరీలు నిర్మించనున్నామని, ఇందుకు అవసరమైన స్థల సేకరణ పూర్తయిందని వివరించారు. 2025 నాటికి ఫ్యాక్టరీలను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. పక్కా ప్రణాళికతో 2030 నాటికి ఆయిల్‌ఫెడ్ టర్నోవర్‌ను 3500 కోట్లకు పెంచడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఆయిల్‌ఫాం సాగుకు ప్రభుత్వం చేయూతనివ్వడం హర్హణీయమని, బడ్జెట్లో ప్రత్యేకంగా రూ.1000 కోట్లు కేటాయించడం ఆయిల్‌పాం రైతులకు వరమని అన్నారు. టీఅండ్పీ మేనేజర్ శ్రీకాంత్‌రెడ్డి, ఆయిల్‌ఫెడ్ డీవో వలపర్ల ఉదయ్‌కుమార్, మేనేజర్లు పాల్గొన్నారు.