కామేపల్లి, మార్చి 18: ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలోని పొన్నెకల్లో పులి సంచారం కలకలం రేపుతున్నది. పులి అలికిడితో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. గురువారం రాత్రి గ్రామం శివారులో పులి సంచరించినట్లు గ్రామస్తులు వెల్లడిస్తున్నారు. శుక్రవారం ఉదయం గ్రామంలోని బుగ్గవాగు సమీపంలో రైతులు పులి పాదముద్రలు గుర్తించారు. సమాచారం అందుకున్న ఎఫ్ఎస్వో రమేశ్, సిబ్బందితో కలిసి గ్రామానికి వచ్చారు. పులి పాదముద్రలను సేకరించారు. పులి కారేపల్లిలోని మండలం పుల్లూరు వైపు వెళ్లినట్లు అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. ఆయా గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పులి అలికిడిపై ఎలాంటి సమాచారం అందినా తమకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.