సత్తుపల్లి నియోజకవర్గంలో పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి
అసెంబ్లీలో ఎమ్మెల్యే సండ్ర ప్రస్తావన.. సభ దృష్టికి పలు సమస్యలు
సత్తుపల్లి, మార్చి 14: రాష్ట్ర ప్రభుత్వం పామాయిల్ సాగుపై దృష్టి పెట్టి రాష్ట్రంలో పెద్ద ఎత్తున సాగును ప్రోత్సహిస్తున్నందున రైతులకు మరికొన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కోరారు. ఈ మేరకు సోమవారం అసెంబ్లీలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పామాయిల్ సాగుచేసే రైతులకు ప్రోత్సాహకాలు కల్పించాలని కోరారు. విత్తనం కొరత ఎక్కువగా ఉన్నందున మొక్కలు రైతులకు సరఫరా చేసే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలని విన్నవించారు. డ్రిప్ ఇరిగేషన్ పొందే రైతులకు గతంలో 10 ఎకరాల పరిమితి ఉండేదని, దానిని 30 ఎకరాల వరకు పెంచాలని కోరారు. సత్తుపల్లి నియోజకవర్గంలోనూ పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరారు. ‘
మన ఊరు – మన బడి’ లో భాగంగా తల్లాడ, వేంసూరు మండలాల్లో జూనియర్ కళాశాలల, సత్తుపల్లి జూనియర్ కళాశాలకు పర్మినెంట్ భవనం ఏర్పాటు చేయాలని కోరారు. గ్రామాల్లో ఇళ్లపై ఉన్న హైటెన్షన్ వైర్లను తొలగించేలా విద్యుత్ అధికారులను ఆదేశించాలన్నారు. గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసుకునేందుకు పంచాయతీలకు అధికారాలు కల్పించాలని కోరారు. గ్రామదీపికల సమస్యలు, మండల పరిషత్లో కంప్యూటర్ ఆపరేటర్ల, గ్రామ పారిశుధ్య కార్మికుల సమస్యలు, మిషన్ భగీరథ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు. ఆసరా పింఛన్లలో సాంకేతిక సమస్యలను తొలగించి ఏప్రిల్ 1 నుంచి అర్హులందరికీ పింఛన్లు అందజేయాలని కోరారు.
డ్రిప్ సౌకర్యం కల్పించాలి: ‘పేట’ ఎమ్మెల్యే మెచ్చా
దమ్మపేట, మార్చి 14: ఏజెన్సీ నియోజకవర్గమైన అశ్వారావుపేటలో పామాయిల్ రైతుల సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కోరారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. పూర్తిగా ఏజెన్సీ ప్రాంతమైన తమ నియోజకవర్గంలో పామాయిల్ సాగు విస్తరించి ఉందని అన్నారు. ఇక్కడి రైతులకు డ్రిప్ సౌకర్యాన్ని కల్పించి పంటల సాగుకు తోడ్పాటు అందించాలని కోరారు. అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో పామాయిల్ ఫ్యాక్టరీలు ఉన్నందున ఇక్కడి రైతులకు సాగు కోసం పామాయిల్ మొక్కలు అందించాలని, మరిన్ని ప్రోత్సాహకాలు కల్పించాలని కోరారు. అలాగే, ఈ ప్రాంత గిరిజనులకు పట్టాదారు పాస్ పుస్తకాలు సైతం అందించాలని విజ్ఞప్తి చేశారు.