మున్నేరు, ఆకేరు నదులపై నుంచి ఎగువకు గోదావరి నీరు
నీటిపారుదల శాఖ సీఈ
ఖమ్మం, మార్చి 14: సీతారామ ప్రాజెక్టు ద్వారా సాగునీటిని రైతులకు అందించాలన్న సంకల్పంతో జరుగుతున్న పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీర్ శంకర్‌నాయక్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం తమ సిబ్బందితో కలిసి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో జరుగుతున్న రివర్ క్రాసింగ్ పనులను ఆయన పరిశీలించారు. తిరుమలాయపాలెం మండలం తిప్పారెడ్డిగూడెం వద్ద ఆకేరు రివర్ క్రాసింగ్ పనులను, డోర్నకల్ మండలం గొల్లగూడెం సమీపంలో ఉన్న మున్నేరు క్రాసింగ్ పనులను ఆయన పరిశీలించారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా వచ్చే సాగు నీటిని మున్నేరు, ఆకేరు నదులపై నుంచి ఎగువకు పంపించేందుకు వంతెనల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని అన్నారు. జాప్యం లేకుండా పనులు పూర్తి చేయాలని, ఎక్కడైనా తేడా వస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ఈ రవికుమార్, ఈఈ సమీర్‌రెడ్డి, డీఈ రమేశ్‌రెడ్డి పాల్గొన్నారు.