ఆంగ్ల విద్యపై విద్యాశాఖ మంత్రి వీసీలో ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్
ఖమ్మం ఎడ్యుకేషన్, మార్చి 14: భవిష్యత్లో విద్యారంగంలో సమూల మార్పుల కోసం రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టినందున ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమ బోధనకు 2,200 మంది ఉపాధ్యాయులను సంసిద్ధం చేస్తున్నట్లు ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 8 తరగతుల విద్యార్థులకు వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియం బోధించేందుకు రూపొందించిన కార్యక్రమాన్ని సోమవారం హైదరాబాద్లో రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు. అనంతరం జిల్లాల కలెక్టర్లు, డీఈవోలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యాశాఖ మంత్రి పలు సూచనలు, ఆదేశాలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సమాధానమిస్తూ.. ఇప్పటికే శిక్షణ పొందిన 60 మంది మాస్టర్ ట్రైనర్స్ ద్వారా తొమ్మిది వారాలపాటు ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామన్నారు. డీఈవో యాదయ్య, డైట్ ప్రిన్సిపాల్ సత్యనారాయణ, ట్రైనర్లు పాల్గొన్నారు.