తెలంగాణ సర్కారు నిర్ణయంతో పెద్ద సంఖ్యలో కొలువులు
ఉద్యోగార్థులు వాటిని సద్వినియోగం చేసుకోవాలి
‘నైబర్ హుడ్ పార్లమెంట్’లో సుడా చైర్మన్ విజయ్‌కుమార్
ఖమ్మం, మార్చి 14: ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న ప్రత్యేక నిర్ణయాలతో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయని సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్ పేర్కొన్నారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. నెహ్రూ యువ కేంద్రం, బీఆర్ అంబేద్కర్ స్టడీ సెంటర్, ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నగరంలోని ఎంబీ గార్డెన్స్‌లో సోమవారం నిర్వహించిన నైబర్ హుడ్ పార్లమెంట్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 90 వేల ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ఇటీవల అసెంబ్లీలో ప్రకటించారని గుర్తుచేశారు. ఇన్ని వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్న శాసనసభలో ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ తప్ప దేశంలో మరెవ్వరూ లేరని అన్నారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రత్యేక కృషి కారణంగా ఖమ్మంలో ఐటీ హబ్ ఏర్పడిందన్నారు.
ఖమ్మం రూపు రేఖలు మార్చిన ఘనత మంత్రి పువ్వాడదేనని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న వివిధ శిక్షణ తరగతుల్లో పాల్గొని మంచి భవిష్యత్‌కు పునాది వేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు ఏ రంగంలో కొలువు సాధించాలనుకుంటున్నారో నిర్దేశించుకొని పట్టుదలతో ప్రయత్నిస్తే మంచి ఫలితాలే వస్తాయన్నారు.వైద్య విద్య అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఖమ్మంలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయబోతోందన్నారు. జిల్లా వైద్య విద్యార్థులకు ఇది వరమని అన్నారు. తొలుత కేఎంసీ మేయర్ నీరజ జ్యోతి ప్రజ్వలన చేశారు. డాక్టర్ గోపీనాథ్, ఎన్ఎస్ఎస్ కేయూ కో ఆర్డినేటర్ ఈసం నారాయణ, బీఆర్ అంబేద్కర్ స్టడీ సెంటర్ బాధ్యులు రాజ్‌కుమార్, మధు, ఇండస్ట్రీస్ డైరెక్టర్ అజయ్, అన్వేశ్, జక్కుల వెంకటరమణ, కోడిరెక్క ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు.