ఈ పథకంతో దళితుల జీవితాల్లో సరికొత్త వెలుగులు
ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్
చింతకాని, మార్చి 14: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకంలో స్థానిక దళితులు లాభసాటి యూనిట్లను ఎంపిక చేసుకోవాలని, దళిత కుటుంబాలు పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. మండలంలో సీతంపేట ఎస్సీ కాలనీలో సోమవారం పర్యటించిన ఆయన.. దళితుల స్థితిగతులను పరిశీలించి వారికి కావాల్సిన యూనిట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో దళిత కుటుంబాలకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అనుభవం ఉన్న రంగాల్లో యూనిట్లను ఎంపిక చేసుకుంటే వ్యాపారం అభివృద్ధి చెంది జీవితాల్లో పెనుమార్పులు వస్తాయని అన్నారు. యూనిట్ల స్థాపనలో లబ్ధిదారులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని, రాష్ట్రంలోని ఏ ప్రదేశంలోనైనా రూ.10 లక్షలతో యూనిట్లు నెలకొల్పుకోవచ్చని వివరించారు. దళితులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ధ్రువపత్రాల కోసం లబ్ధిదారులు ఏ కార్యాలయానికీ వెళ్లవద్దని, జిల్లా స్థాయి అధికారులే లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వచ్చి ధ్రువపత్రాలు అందిస్తారని అన్నారు. సర్పంచ్ కొండలరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సత్యనారాయణ, ప్రత్యేకాధికారి శ్రీనివాస్, ఎంపీపీ పూర్ణయ్య, మండలాధికారులు మంగీలాల్, రవికుమార్, రవీంద్రకుమార్, మమత, నాగయ్య పాల్గొన్నారు.