చేస్తున్న అభివృద్ధి గురించి చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది
అభివృద్ధిని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు : మంత్రి అజయ్
ఖమ్మానికి మెడికల్ కళాశాల మంజూరు పట్ల కార్పొరేటర్ల హర్షం
పుష్పగుచ్ఛం, శాలువాలతో కప్పి మంత్రిని సతరించిన కార్పొరేటర్లు
ఖమ్మం/ రఘునాథపాలెం, మార్చి 13: అభివృద్ధి, ఆరోగ్య తెలంగాణే సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపేందుకు కేఎంసీ కార్పొరేటర్లు ఆదివారం మంత్రి అజయ్‌కుమార్‌ను ఆయన నివాసంలో కలిశారు. పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువాలతో సతరించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతిపక్షాలు గోబెల్స్ ప్రచారం చేస్తున్న ఈ సమయంలో మనం చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు చెప్పుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఖమ్మం అభివృద్ధిని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. ఖమ్మం జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేయడం చరిత్రలో మిగిలిపోతుందన్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ మెడికల్ కళాశాల అందుబాటులోకి రానుండడంతో వైద్య విద్యను అభ్యసించి సమాజానికి మరింత మంది వైద్యులు అందుబాటులోకి రానున్నారన్నారు. డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, మేయర్ నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న, టీఆర్ఎస్ నాయకులు ఆర్జేసీ కృష్ణ, పగడాల నాగరాజు, ఖమర్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
ఇళ్ల పట్టాలతో శాశ్వత హక్కులు
ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న పేదల ఇళ్లకు ఆస్తి హక్కు కల్పించేందుకే పొజిషన్ పట్టాలను పంపిణీ చేస్తున్నట్లు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం గొల్లగూడెంలోని పేదలకు ఖమ్మం అర్బన్ రెవెన్యూ అధికారులు ఆదివారం పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. దీనికి మంత్రి పువ్వాడ హాజరై పట్టాలను అందజేశారు. పట్టాలు పొందిన పేదలు నివాసం ఉండే ప్రాంతాల్లో అన్ని రకాల మౌలిక సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఖమ్మం అర్బన్ తహసీల్దార్ మేదరమెట్ల శైలజ, కార్పొరేటర్ కూరాకుల వలరాజు, నాగండ్ల కోటి, నాయకులు దేవభక్తుని కిశోర్‌బాబు, ముక్తార్, తోట ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.