చెక్కుల పంపిణీలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర
సత్తుపల్లి, మార్చి 13: అనారోగ్యానికి గురై అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి విముక్తి లభిస్తుందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. నియోజకవర్గంలోని 200 మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఫ్ నుంచి మంజూరైన రూ.1.55 కోట్ల విలువైన చెక్కులను పట్టణంలోని ఎంఆర్ గార్డెన్స్‌లో ఆదివారం ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్య రంగంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారన్నారు. ఇందులో భాగంగానే జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెంలో ఓ మెడికల్ కళాశాల పనులు ప్రారంభం కాగా ఖమ్మం జిల్లాకు ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ సమావేశంలో మరో కళాశాలకు అనుమతి ఇచ్చారని గుర్తుచేశారు. దీనివల్ల పేదలకు ఆరోగ్య భరోసా కలుగుతుందన్నారు.
సత్తుపల్లి పట్టణంలో రెండు బస్తీ దవాఖానలు, నియోజకవర్గం మొత్తంలో 20 పల్లె దవాఖానలు మంజూరయ్యాయన్నారు. మండలానికి రెండు పీహెచ్సీ కేంద్రాలు ఉండేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అసెంబ్లీలో ప్రకటన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. నిరుద్యోగుల పాలిట దేవుడన్నారు. సత్తుపల్లిలో నిరుద్యోగుల కోసం కోచింగ్ సెంటర్లు సైతం ఏర్పాటు చేస్తామన్నారు. మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, ఎంపీపీలు దొడ్డా హైమావతి శంకర్రావు, పగుట్ల వెంకటేశ్వరరావు, ఆత్మ చైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, జడ్పీటీసీలు కూసంపూడి రామారావు, మారోజు సుమలత సురేశ్, సొసైటీల అధ్యక్షులు చిలుకుర్తి కృష్ణమూర్తి, తుమ్మూరి శ్రీరాంప్రసాద్, టీఆర్ఎస్ నాయకులు యాగంటి శ్రీను, పాల వెంకటరెడ్డి, కనగాల వెంకట్రావు, రఫీ, అంకమరాజు, డీసీసీబీ డైరెక్టర్ గొర్ల సంజీవరెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.