మారుమూల గ్రామాల్లోనూ ఇంగ్లిష్ మీడియం
ఆదరిస్తున్న తల్లిదండ్రులు
‘మన బడి’కి స్కూల్ ఎంపిక
ఎమ్మెల్యే కందాళ చొరవతో మౌలిక వసతులు
కూసుమంచి రూరల్, మార్చి 12: చదువులమ్మ ఒడిని తలపిస్తోంది ఈ సర్కారు బడి. మౌలిక వసతులు సమకూరడం, ఇంగ్లిష్ మీడియం బోధన అందుతుండడం వంటి కారణాలతో మారుమూల గ్రామాల్లోనూ ఆదరణ పొందుతోంది. అక్కడి తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ పాఠశాలకే పంపుతుండడంతో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కూసుమంచి మండలంలో ఖమ్మం జిల్లా సరిహద్దులోని మారుమూల గ్రామమైన ఈశ్వరమాదారంలోని ప్రాథమిక పాఠశాల.. స్థానికుల చొరవ, ఆదరణతో ఉన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్ అయింది. వసతులను సమకూర్చుకుంది. ఇక్కడకు ఐదు కిలోమీటర్ల దూరంలోని నాయకన్‌గూడెంలో జడ్పీ ఉన్నత పాఠశాల ఉన్నప్పటికీ ఈశ్వరమాదారం యూపీఎస్ గ్రామస్తుల చొరవతో 2004లో ఉన్నత పాఠశాలగా ప్రమోట్ అయింది. విద్యార్థుల సంఖ్యను పెంచుకుంటూ ప్రైవేట్‌కు దీటుగా విద్యను అందించడం వల్ల ఆదరణ పెరిగింది. ఈ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు వివిధ రంగాల్లో స్థిరపడ్డారు. ఇటీవల వీరంరెడ్డి మాధురి, మోర్తాల త్రివేణి అనే ఇద్దరు విద్యార్థినులు ఐఐటీ బాసరలో సీట్లు సాధించారు. ఈ పాఠశాలలో ఇప్పటికే సరిపడా తరగతి గదులు సమాకూరాయి. ఫర్నిచర్, ప్రహరీ వంటివన్నీ ఉన్నాయి. ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు ఒకే ప్రాంగణంలో కొనసాగుతున్నాయి. ప్రాథమిక పాఠశాలలోనే విద్యార్థులు ఎక్కువ మంది ఉన్నారు. మొదటి విడతలోనే ‘మన ఊరు – మన బడి’ పథకానికి ఈ స్కూల్ ఎంపికైంది. ఈ పథకం కింద వచ్చే నిధులతో గ్రంథాలయ భవనం, రీడింగ్ రూం, బల్లలు, టేబుళ్లు, వంట గది, డైనింగ్ హాలు నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించారు. ఈ పథకానికి వచ్చే నిధుల కోసం రెండు బ్యాంకు ఖాతాలను తెరిచారు.
ఎన్ఆర్ఐ విరాళం..
ఈ పాఠశాల అభివృద్ధి కోసం గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ శ్రీనివాసరావు.. పాఠశాల బ్యాంకు ఖాతాలో రూ.లక్ష డిపాజిట్ చేశారు. ఏటా వచ్చే వడ్డీని పదో తరగతిలో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు పారితోషికంగా అందిస్తున్నారు.
ఎమ్మెల్యే కందాళ చొరవతో..
గతంలో ఇదే గ్రామ పంచాయతీకి చెందిన ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి ఈ పాఠశాల అభివృద్ధికి కృషిచేస్తూ వస్తున్నారు. సుమారు ఆరేళ్ల క్రితం రూ.5 లక్షలతో కళావేదిక నిర్మాణం, జిరాక్స్ యంత్రం, బల్లలు, నీటి మోటర్ సమకూర్చారు. అలాగే గత ఏడాది ఆయన ఈ పాఠశాలను సందర్శించిన సమయంలో.. ఉపాధ్యాయులు, గ్రామస్తులు కలిసి ఇంగ్లిషు మీడియం మంజూరు చేయాలని కోరారు. దీంతో ఆయన రాష్ట విద్యాశాఖ అధికారులతో మాట్లాడి ఈ విద్యాసంవత్సరంలో ఇంగ్లిషు మీడియం మంజూరు చేయించారు. ప్రస్తుతం ఆరో తరగతిలో ఇంగ్లిషు మీడియం బోధిస్తున్నారు. ఈ తరగతిలో ప్రసుత్తం 24 మంది విద్యార్థులు ఉన్నారు. పాఠశాలలోని మొత్తం విద్యార్థుల్లో ఇది నాలుగో వంతు.
మౌలిక సమస్యల పరిష్కారం
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంతో పాఠశాలల్లో మౌలిక వసతులు పరిష్కారమయ్యాయి. విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇది ఎంతో మేలు చేకూర్చుతోంది. ప్రతిభ ఉన్న విద్యార్థులకు మరింత ఉపయోగకరం. దీనిలో గ్రామస్తులు, ప్రజాప్రతినిధులను కూడా భాగస్వాములను చేయడం వల్ల ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది.
–వీ.రాధాకృష్ణ, ప్రధానోపాధ్యాయుడు