అశ్వారావుపేట, డిసెంబర్ 9: అశ్వారావుపేట మండలంలో గ్రామీణ వైద్యుడిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని తిరుమలకుంట గ్రామానికి చెందిన లింగాల చక్రధర్ (40) ఆర్ఎంపీగా పని చేస్తున్నాడు. వృత్తిలో భాగంగా గురువారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. రాత్రి 8 గంటలకు భార్య జయలక్ష్మి చక్రధర్‌కు ఫోన్ చేయడంతో గుర్తు తెలియని వ్యక్తి లిఫ్ట్ చేసి డాక్టర్ గారు మందుల కోసం భద్రాచలం వెళ్లారని, తమ వద్ద ఫోన్ చార్జింగ్ పెట్టారని బదులిచ్చాడు. కొద్దిసేపటికి చక్రధర్ కుమార్తె ప్రభావతి ఫోన్ చేయమని తన తండ్రి మొబైల్‌కు వాట్సాప్ మెసేజ్ చేసింది. మెసేజ్ చూసినట్లు బ్లూ టిక్ పడడంతో గమనించి వెంటనే ఫోన్ చేసింది. ఫోన్ లిఫ్ట్ చేసిన వ్యక్తి ‘డాక్టర్ గారు ఫోన్ ఇక్కడ చార్జింగ్ పెట్టి వెళ్లార’ని సమాధానం ఇవ్వడంతో ఫోన్ లాక్ తీసి మెసేజ్ ఎలా చూశావని ప్రశ్నించింది. దీంతో వెంటనే అవతలి వ్యక్తి ఫోన్ కట్ చేసి స్విచ్చాఫ్ చేశాడు. సీన్ కట్ చేస్తే.. శుక్రవారం వినాయకపురం సమీపంలోని మామిడి తోటకు వెళ్లే దారిలో చక్రధర్ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. అశ్వారావుపేట ఇన్చార్జి సీఐ నాగరాజు, ఎస్‌హెచ్‌వో రాజేశ్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మెడ కోసి గుండెలపై కత్తితో పొడిసినట్లు గుర్తించిన పోలీసులు డాగ్ స్కాడ్, క్లూస్ టీమ్‌ని రప్పించి ఆధారాలు సేకరించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని అశ్వారావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అశ్వరావుపేట ఇన్చార్జి సీఐ నాగరాజు తెలిపారు.