మామిళ్లగూడెం, డిసెంబర్ 9 : తెలంగాణ రాష్ట్రంలో రైతులకు డిజిటల్ మార్కెటింగ్‌లో సేవలు అందించేందుకు నెదర్లాండ్ రాబో బ్యాంక్, మాస్టర్‌కార్డ్ (యూఎస్ఏ), జర్మనీకి చెందిన బేయర్ సంస్థల భాగస్వామ్యంతో రాష్ట్రంలోని డీసీసీబీల ద్వారా ప్రత్యేక డిజిటల్ ఫ్లాట్‌ఫాంను రూపొందించనున్నట్లు రాబో బ్యాంక్ సీనియర్ ప్రాజెక్టు మేనేజర్ బిజ్నోర్ తెలిపారు. నగరంలోని ఖమ్మం డీసీసీబీలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా తెలంగాణలోని ఖమ్మం, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ డీసీసీబీల్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఎఫ్‌పీసీలను అభివృద్ధి చేయడానికి ఈ ప్రాజెక్టు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. ఈ డిజిటల్ మార్కెట్ ద్వారా రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, మార్కెటింగ్‌కు సలహాలు, సేవలు అందించేందుకు కృషి చేస్తామని వివరించారు.
అదేవిధంగా ఇన్పుట్ క్రెడిట్స్, లాజిస్టిక్స్, ఇన్సూరెన్సు పథకాలు రైతులకు అందిస్తామన్నారు. దీని ద్వారా రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను డిజిటల్ మార్కెట్లో ఉంచి వాటి విలువను పెంచుకునేందుకు ఈ ప్లాట్‌ఫాం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. రైతుల నికర ఆదాయం పెంచడంతోపాటు బ్యాంకుల వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఈ వేదిక ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ వేదిక ద్వారా రైతులు పండించిన పంటలను నేరుగా కొనుగోలు చేసే వ్యాపారులను, రైతులను భాగస్వామ్యం చేయడం ద్వారా ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. ప్యాక్స్ సభ్యుల వివరాలను డిజిటలైజ్ చేసి అన్ని రకాల సేవలు అందిస్తామన్నారు. ఈ పైలట్ ప్రాజెక్టులో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా 60 వేల మంది రైతులను ఎంపిక చేసి ప్రాథమికంగా వారికి ఈ డిజిటల్ ప్లాట్‌ఫాం ద్వారా సేవలు అందించి క్రమంగా దీనిని విస్తరిస్తామన్నారు. ఈ సేవలన్నీ తెలంగాణ రాష్ట్ర టెస్కాబ్, రాబో బ్యాంక్ సంయుక్తంగా చేసుకున్న ఎంవోయూ ప్రకారం కొనసాగుతాయని వివరించారు. దీని ద్వారా రానున్న రోజుల్లో రైతుల పంటలకు ఎంతో డిమాండ్ ఉంటుందని తెలిపారు. రాబో బ్యాంక్ కంట్రీ హెడ్ మారియానే, ప్రాజెక్టు మేనేజర్ సిఫోరా, టెస్కాబ్ ప్రతినిధులు షరీఫ్, ఖమ్మం డీసీసీబీ సీఈవో వీరబాబు, బ్యాంకు అధికారులు తదితరులు పాల్గొన్నారు.