కొత్తగూడెం సింగరేణి, డిసెంబర్ 9: సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో మరో 643 కొత్త క్వార్టర్ల నిర్మాణానికి బోర్డు ఆమోదం తెలిపిందని, మొత్తం రూ.354 కోట్లతో మరో 18 నెలల్లో వీటి నిర్మాణం పూర్తవుతుందని సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను శుక్రవారం ఓ ప్రకటన ద్వారా విడుదల చేశారు. సీఎం కేసీఆర్ సింగరేణి ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు విశాలమైన డబుల్ బెడ్ రూం క్వార్టర్ల నిర్మాణంలో భాగంగా రెండో దశలో కొత్త క్వార్టర్లు నిర్మించడానికి బోర్డాఫ్ డైరెక్టర్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు. 2018 ఫిబ్రవరి 27న శ్రీరాంపూర్‌లో జరిగిన సింగరేణీయుల ఆత్మీయ సమ్మేళనంలో సీఎం కేసీఆర్ సింగరేణి వ్యాప్తంగా పాత క్వార్టర్ల స్థానంలో కొత్తవి, సౌకర్యవంతమైనవి నిర్మించి ఇస్తామని కార్మికులకు హామీ ఇచ్చారని, ఈ మేరకు ఇప్పటికే సింగరేణి సంస్థ భూపాలపల్లి, కొత్తగూడెం, ఆర్జీ3 ఏరియా, సత్తుపల్లి ప్రాంతాల్లో 1,853 క్వార్టర్లను నిర్మించిందని వివరించారు. రెండో దశలో ఇప్పుడు మరో 643 క్వార్టర్లను రూ.354 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్నట్లు చెప్పారు.
సంస్థ వ్యాప్తంగా మొత్తం 43 వేల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, 49,919 క్వార్టర్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. కార్మికుల సంక్షేమానికి సింగరేణి పెద్దపీట వేస్తోందని, దేశంలో ఎక్కడా లేని అనేక పథకాలను అమలు చేస్తుందని అన్నారు. సీఎం కేసీఆర్ సూచన మేరకు కార్మికులకు ఉచితంగా కరెంటు, సొంత ఇల్లు నిర్మాణానికి రూ.10 లక్షల రుణంపై వడ్డీ చెల్లింపు, కార్మికుల తల్లిదండ్రులకు ఉచిత వైద్యం, కార్మికుల పిల్లల ఉన్నత చదువులకు ఫీజు రీయింబర్స్మెంట్, 10 రెట్లు పెంచి చెల్లిస్తున్న మ్యాచింగ్ గ్రాంట్, ఏటా లాభాల్లో వాటా లాంటి అనేక పథకాలు ఇక్కడ అమలు జరుగుతున్నాయని ఆయన వివరించారు. సింగరేణి ఉద్యోగులు, కార్మిక సంఘాలు సంస్థ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలపై హర్షం వ్యక్తం చేస్తున్నారని, సింగరేణి చరిత్రలో అత్యధికంగా ఈ ఏడాది 700 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. ఈ దిశగా ఉద్యోగులందరూ కృషి చేయాలని, తద్వారా చరిత్రలోనే అత్యధిక లాభాలు, సంక్షేమం అందుకోవచ్చని పేర్కొన్నారు.