మామిళ్లగూడెం,డిసెంబర్ 6: వచ్చే నెల 18 నుం చి వంద రోజుల పాటు ప్రణాళికాబద్ధంగా ‘కంటి వెలుగు’ నిర్వహించాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆదేశించారు. జగిత్యాల కలెక్టరేట్ నుంచి మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఎంహెచ్వోలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. పంచాయతీ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, వైద్యారోగ్యశాఖ అధికారులు సమన్వయంతో వ్యవహరించాలన్నారు. ప్రతి బృందంలో ఒక డాక్టర్, కంటి వైద్యనిపుణుడు, ముగ్గురు ఆశ కార్యకర్తలు, ఇద్దరు ఏఎన్ఎంలు, ఒక డాటా ఎంట్రీ ఆపరేటర్, ఇద్దరు సీహెచ్‌వోలు ఉండాలన్నారు. కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ.. కంటి వెలుగు శిబిరాల నిర్వహణకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, ఖమ్మం మునిసిపల్ కమిషనర్ ఆదర్శ్‌సురభి, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారిణి బి.మాలతి, జడ్పీ సీఈవో వీవీ అప్పారావు పాల్గొన్నారు.
కంటి పరీక్షలకు 48 బృందాలు మంత్రి హరీశ్‌రావు సమీక్షలో కలెక్టర్ అనుదీప్
భద్రాద్రి జిల్లాలోని జనాభాకు అనుగుణంగా జనవరి 18 నుంచి కంటి వెలుగు కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అందుకు 48 బృందాలను ఏర్పాటు చేశామని కలెక్టర్ అనుదీప్ అన్నారు. హైదరాబాద్ నుంచి మంగళవారం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడారు. త్వరలో కంటి వైద్యనిపుణుల పోస్టులను భర్తీ చేస్తామన్నారు. జిల్లా పంచాయతీ అధికారి, మున్సిపల్ కమిషనర్లు, వైద్యాధికారులను సమన్వయం చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామన్నారు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి సయ్యద్ ఆలీ ముర్తుజా రిజ్వి, వైద్యశాఖ కమిషనర్ శ్వేతా మహంతి, రాష్ట్ర వైద్యశాఖ సంచాలకుడు గడల శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఎంహెచ్‌వో దయానందస్వామి, డీపీవో రమాకాంత్, మున్సిపల్ కమిషనర్లు రఘు, శ్రీకాంత్, అంకుషావలి, వైద్యాధికారులు పాల్గొన్నారు.