మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
బోనకల్లు మార్చి 11 : తాను టీఆర్ఎస్ రెబల్ను కాదని, పార్టీకి విధేయుడిని మాత్రమేనని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం ఆయన ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ తనకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారని గుర్తుచేశారు. టీఆర్ఎస్ బలోపేతానికి అనుక్షణం పని చేస్తానన్నారు. పార్టీ అధిష్ఠానం, ప్రజల అభీష్టం మేరకు ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు. పార్టీ నిర్ణయాన్ని ప్రతి కార్యకర్త శిరసావహించాలన్నారు. పార్టీల లక్ష్యాల మేరకు కార్యకర్తలు పనిచేయాలన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. తాను పార్టీకి ఏనాడూ ద్రోహం చేయలేదన్నారు. ఆత్మీయ సమావేశమైనా, ఇతర ఏ సమావేశమైనా కార్యకర్తలు పార్టీ అభ్యర్థుల గెలుపు కోసమే కృషి చేయాలన్నారు. పార్టీ నిర్ణయం మేరకు కలిసి మెలిసి పనిచేయాలన్నారు. వ్యక్తులు, పదవులు శాశ్వతం కాదన్నారు. పార్టీయే శాశ్వతమన్నారు. టీఆర్ఎస్ హయాంలోనే ఉమ్మడి జిల్లాలో అభివృద్ధికి అడుగులు పడ్డాయన్నారు. సీఎం కేసీఆర్ పాలనను ప్రజలు స్వాగతించడంతోనే ఆయన రెండుసార్లు ముఖ్యమంత్రిగా సేవలు అందిస్తున్నారన్నారు.
సీతారామప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి జిల్లాతో పాటు పొరుగు జిల్లాలోని 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. రైతుబీమా, రైతుబంధు, 24 గంటలు విద్యుత్ సరఫరా రైతులకు ఎంతో మేలు చేస్తున్నాయన్నారు. ప్రస్తుతం తెలంగాణ రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా మారిందన్నారు.కొవిడ్ కారణంగా రాష్ట్రంలో సంక్షోభం నెలకొన్నదని, ఇదే అదునుగా భావించి ప్రతిపక్షాలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నాయన్నారు. అన్నింటినీ తిప్పికొడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. సమావేశంలో నాయకులు చీదిరాల వెంకటేశ్వర్లు, అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, వేమిరెడ్డి లక్ష్మారెడ్డి, పుతుంబాక శ్రీకృష్ణప్రసాద్, ఐతం వెంకటేశ్వరరావు, చావలి రామరాజు, వెలగపుడి శివరాంప్రసాద్, మాదాల రామారావు, ఎన్నం కోటేశ్వరరావు, చెరుకూరి నాగార్జున్, మొండితోక సుధాకర్, నెల్లూరి రవి, కోమిటిడి శ్రీనివాసరావు, గడ్డం భద్రయ్య పాల్గొన్నారు.