ఉత్తర్వులు జారీ చేసిన ఆ రాష్ట్ర ప్రభుత్వం
జిల్లా ఖ్యాతిని దేశవ్యాప్తం చేసిన వేణుప్రసాద్
ఖమ్మం ఎద్యుకేషన్, మార్చి 12: ఖమ్మం జిల్లా వాసికి అరుదైన గౌరవం దక్కింది. పంజాబ్ నూతన ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అందివచ్చాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి అదనపు చీఫ్ సెక్రటరీగా పనిచేసే అవకాశం లభించింది. ఈ మేరకు పంజాబ్ సర్కార్ శనివారం నియామక ఉత్తర్వులు జారీ చేసింది. ఖమ్మం నగరానికి చెందిన అరిబండి వేణుప్రసాద్ 1991లో సివిల్స్ ఉత్తీర్ణులయ్యారు. అదే ఏడాది ఐఏఎస్ అధికారిగా పంజాబ్లో బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఆ రాష్ట్రంలోనే ఐఏఎస్ అధికారిగా పలు హోదాల్లో పని చేశారు. ఆయన 10వ తరగతి వరకు ఖమ్మంలోని రిక్కాబజార్ స్కూల్లో చదువుతున్నారు. ఇంటర్ విద్యను నాగార్జున సాగర్లోని ఏపీ రెసిడెన్షియల్ కళాశాలలో పూర్తి చేశారు. బాపట్లలో అగ్రికల్చర్ బీఎస్సీని, రాజేంద్రనగర్లో పీజీని పూర్తి చేశారు. ఆయన సతీమణి ఆర్థికశాస్త్రం విభాగంలో ప్రొఫెసర్గా పంజాబ్ రాష్ట్రంలోనే పని చేస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. ఒక కుమార్తె ముంబయిలో, మరో కుమార్తె నొయిడాలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఖమ్మం వాసికి పంజాబ్ సీఎంకు అదనపు చీఫ్ సెక్రటరీగా పని చేసే అవకాశం లభించడంతో నగర ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. జిల్లా ఖ్యాతిని దేశ వ్యాప్తంగా ఇనుమడింపజేశారంటూ అభినందిస్తున్నారు.