ఖమ్మం, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా సత్తుపల్లి నియోజకవర్గానికి వచ్చిన బండి పార్థసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్రలకు నియోజకవర్గ సరిహద్దు అయిన తల్లాడలో ఘన స్వాగతం లభించింది. జిల్లాలో టీఆర్ఎస్ బలాన్ని చాటిచెబుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, నేతలు ఈ స్వాగత కార్యక్రమానికి హాజరయ్యారు. ఖమ్మం నుంచి తల్లాడకు చేరుకున్న మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు బండి పార్థిసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, ఇతర ఎమ్మెల్యేలకు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.
తల్లాడ నుంచి సత్తుపల్లి వరకు దాదాపు 50 కిలోమీటర్ల వరకూ వందలాది కార్లు, బైకులతో భారీ ప్రదర్శన నిర్వహించారు. ప్రతీ గ్రామంలో దారిపొడవునా టీఆర్ఎస్ శ్రేణులు స్వాగతం పలికాయి. రోడ్‌షోలలో మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. బీజేపీ పన్నిన కుట్రలు, కుతంత్రాలను ప్రజాబలంతోనే టీఆర్ఎస్ తిప్పికొట్టగలిగిందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాసంక్షేమానికి పాటుపడుతుంటే.. బీజేపీ మాత్రం ఎమ్మెల్యేల కొనుగోలుపై దృష్టి సారించిందని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణ ధాన్యం కొనుగోలు చేయడానికి మనసు రాదని విమర్శించారు. కానీ తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి మాత్రం చేయని కుట్ర లేదని దుయ్యబట్టారు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఖమ్మంపై సీఎంకు ఎనలేని అభిమానం ఉందని, అందుకే ఒకేసారి ఇద్దరికి రాజ్యసభ సభ్యులుగా అవకాశం ఇచ్చారని గుర్తుచేశారు.
వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టిస్తుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ను ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేకనే బీజేపీ అనేక కుతంత్రాలకు తెరలేపుతోందని ఆరోపించారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ అభివృద్ధికి నిర్వచనం టీఆర్ఎస్ అని, ఆ పార్టీ ప్రభుత్వంలోనే ప్రజలకు అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందాయని వివరించారు. ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ జిల్లాలో టీఆర్ఎస్ సత్తా ఏమిటో నిరూపించాల్సిన సమయం ఆసన్నమవుతోందని అన్నారు.
పార్టీ బలోపేతాన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి మాట్లాడుతూ.. తన సొంత గడ్డ సత్తుపల్లి నియోజకవర్గంలో టీఆర్ఎస్ శ్రేణులు తనను ఆదరించిన తీరును ఎన్నటికీ మర్చిపోలేనని అన్నారు. తనకు లభించిన ప్రతి అవకాశాన్ని ప్రజా సంక్షేమానికి, ఈ ప్రాంత అభివృద్ధికి వినియోగిస్తానని భరోసా ఇచ్చారు. మరో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుతమైన పథకాలను అమలు చేస్తూ తెలంగాణ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని గుర్తుచేశారు.
రాజ్యసభ సభ్యుడిగా ప్రజాసమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమిస్తానన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకునే విధంగా శ్రేణులు కార్యోన్ముఖులు కావాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు రాములునాయక్, కందాళ ఉపేందర్‌రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, మెచ్చా నాగేశ్వరరావు, రేగా కాంతారావు, హరిప్రియానాయక్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, సీడ్స్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, కేఎంసీ మేయర్ నీరజ, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యురాలు చంద్రావతి, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.