నేలకొండపల్లి, నవంబర్ 18: వ్యవసాయం బాగుంటేనే అన్ని బాగుంటాయని, రాష్ర్టాల ఆర్థిక పరిస్థితి ఇంకా బాగుంటుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. జిల్లాలోనే మొదటిసారిగా నేలకొండపల్లి మండలం పైనంపల్లి గ్రామంలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీలు నామా నాగేశ్వరావు, వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డితో కలిసి శుక్రవారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన తరువాత వ్యవసాయ విధానం మారిందని, పంటలు అద్భుతంగా పండుతున్నాయని అన్నారు. ఈ ఏడాది జిల్లాలో 220 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇప్పటికే 60 లక్షల గన్నీ సంచులను అందుబాటులో ఉంచామని, మరో 40 లక్షల సంచులను తెప్పిస్తున్నామని అన్నారు. ధాన్యం సేకరణ, సంచులు, సకాలంలో చెల్లింపులకు ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారన్నారు. రైతుల నుంచి ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని, అప్పటి వరకూ కేంద్రాలు ఉంటాయని స్పష్టం చేశారు.
ధాన్యం కొనుగోలు విషయంలో నిరుడు కేంద్రంతో యుద్ధం చేశామని గుర్తుచేశారు. ఈ ఏడాది వానకాలంలో 1.30 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతోందని, యాసంగితో కలుపుకొని దాదాపు 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అవుతుందని అన్నారు. ఇదంతా ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమైందని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ అన్నదాతల సంక్షేమానికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్‌కు రైతులందరూ అండగా ఉండాలని కోరారు. కలెక్టర్ వీపీ గౌతమ్, అదనపు కలెక్టర్ మధుసూదన్, జడ్పీ వైస్ చైర్పర్సన్ మరికంటి ధనలక్ష్మి, ప్రజాప్రతినిధులు, అధికారులు వజ్జా రమ్య, నాగుబండి శ్రీనివాసరావు, ఇంటూరి శేఖర్, శాంత, కొండ్రు విజయలక్ష్మి, ఉసిరికాయల లక్ష్మయ్య, విద్యాచందన, విజయకుమా రి, సరిత, విజయ్‌చంద్ర పాల్గొన్నారు.