జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గతేడాది ధాన్యం కొనుగోళ్లకు కేంద్రం ససేమిరా అనడంతో రైతులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని ధాన్యం కొనుగోలు చేసింది. వానకాలం ధాన్యం కొనుగోలుకూ కేంద్రం చేతులెత్తేయడంతో రాష్ట్ర ప్రభుత్వమే ముందుకొచ్చింది. ఈ వానకాలం సీజన్లో ఖమ్మం జిల్లాలో 3.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యంగా వివిధ శాఖల ద్వారా 228 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. 69.28 లక్షల గోనె సంచులనూ సిద్ధం చేసింది. ఈ సీజన్లో అన్నదాతలు 1,17,318 హెక్టార్లలో వరి సాగు చేశారు. గోదాములు, గన్నీ బ్యాగులు, లారీలు, కొనుగోలు కేంద్రాలన్నింటినీ అధికారులు సిద్ధం చేసి ఉంచారు.
– కూసుమంచి, నవంబర్ 14
త్వరలో జిల్లావ్వాప్తంగా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయబోమంటూ నిరుడే కేంద్రం ప్రభుత్వం తేల్చిచెప్పింది. దీంతో పంటను అమ్ముకోవడానికి అనేక ఇబ్బందులు పడ్డారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం సహా రైతులు, రైతు సంఘాలు ఆందోళనకు దిగినా కేంద్రం తలొగ్గలేదు. దీంతో రైతుల ఇబ్బందులను గమనించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గింజనూ తానే కొనుగోలు చేసింది. గత యాసంగిలోనూ ఇదే పరిస్థితి పునరావృతమైతే మళ్లీ తెలంగాణ ప్రభుత్వమే పంటనంతా కొనుగోలు చేసింది. తాజాగా ఈ వానకాలం పంట కొనుగోలు విషయంలోనూ కేంద్రం ఇదే తిరకాసు పెట్టింది. అన్నదాతల ఇబ్బందుల దృష్ట్యా మళ్లీ రాష్ట్ర ప్రభుత్వమే ముందుకొచ్చింది. ఈ మేరకు సంబంధిత అధికారులు అన్ని జిల్లాల్లోని రా, పారా బాయిల్డ్ రైస్ మిల్లుల యజమానులతో సమావేశమై ధాన్యం కొనుగోలుకు అన్ని చర్యలూ తీసుకున్నారు.
6.67 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా..
జిల్లాలో వానకాలం సీజన్లో వర్షాలు పుష్కలంగా కురవడం, జల వనరుల్లో సమృద్ధిగా నీరు ఉండడంతో 2,93,215 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. ప్రస్తుతం ఇవన్నీ కోత దశలో ఉన్నాయి. రాష్ట్ర పభుత్వం కూడా ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.2,060, బీ గ్రేడ్ ధాన్యానికి రూ.2,040 చొప్పున మద్దతు ధర ప్రకటించింది. సత్తుపల్లి నియోజకవర్గంలో ఇప్పటికే మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో 6.67 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. రైతుల అవసరాలకు పోగా మిగిలిన 4.30 మెట్రిక్ టన్నుల ధాన్యం విక్రయానికి వస్తుందని భావిస్తున్నారు. అందులో 3.80 లక్షల మెట్రిక్ టన్నులను కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ఇది కాకుండా మిల్లర్లు మరో 50 వేల మెట్రిక్ టన్నులను కొనుగోలు చేస్తారని పౌర సరఫరాల శాఖ అధికారులు అంచనా వేశారు.
కొనుగోలు కేంద్రాలు ఇలా..
వానకాలంలో రైతులు పండించిన ధాన్యం సేకరణకు 220 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. సహకార సంఘాల ద్వారా 144, మహిళా స్వయం సహాయ సంఘాల ద్వారా 48, డీసీఎంఎస్ ద్వారా 24, వ్యవసాయ మార్కెట్ల ద్వారా 4 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ధాన్యం సేకరణకు పౌర సరఫరాల శాఖ కూడా ఏర్పాట్లు సిద్ధం చేసింది. 95 లక్షల గన్నీ బ్యాగులు కావాల్సి ఉండగా 69.28 లక్షల బ్యాగులను సిద్ధంగా ఉంచింది. 15 ప్రాంతాల్లోని వేర్ హౌస్ గోదాములు, ఏఎంసీ గోదాములు, మండల స్థాయి స్టాక్ పాయింట్లలో గన్నీ బ్యాగులు రెడీగా ఉన్నాయి. 12 గోదాముల్లో ధాన్యాన్ని నిల్వ ఉంచనున్నారు. 51 రా రైస్ మిల్లులు, ఆరు పారా బాయిల్డ్ మిల్లులను ఎంపిక చేశారు. ధాన్యం రవాణా కోసం టెండర్లు పిలిచి లారీలను సైతం సిద్ధం చేశారు.
ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేశాం..
వానకాలం ధాన్యం సేకరణకు అన్ని మండలాల్లో పూర్తి ఏర్పాట్లు చేశాం. గత అనుభవాల దృష్ట్యా ఈ సారి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. రైతులు కూడా అందరూ ఒకేసారి కాకుండా కొనుగోలు కేంద్రాల వద్ద పరిస్థితిని బట్టి ఒకరి తరువాత మరొకరు ధాన్యాన్ని తీసుకురావాలి. గన్నీ బ్యాగులు, లారీలు, రైస్ మిల్లులు, గోదాములు సిద్ధంగా ఉంచాం. రైతులు తాలు లేకుండా నాణ్యమైన ధాన్యాన్ని తీసుకురావాలి.
– మధుసూదన్, అదనపు కలెక్టర్, ఖమ్మం