సీతారామ ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో సాగు సస్యశ్యామలం చేయాలన్న లక్ష్యంతో భద్రాద్రి జిల్లాలోని అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వద్ద గోదావరిపై తెలంగాణ ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టును నిర్మిస్తోంది. ప్రస్తుతం అశ్వాపురం, మొండికుంట ప్రాంతాల్లో సీతారామ ప్రాజెక్టు పనులు పూర్తికావొచ్చాయి. ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం పాలేరు లింక్ కెనాల్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. నిర్మాణం పూర్తయితే గోదావరి జలాలు పాలేరు రిజర్వాయర్‌లోకి రానున్నాయి. దీంతో గోదావరి, కృష్ణా నదుల అనుసంధానమైనట్లవుతుంది. కృష్ణా నది పరివాహక ప్రాంతం కూడా గోదావరి జలాలతో స్థిరీకరణ జరుగనున్నది. అంతేకాదు, ఆయకట్టు భూములన్నీ సస్యశ్యామలం కానున్నాయి. పాలేరు వరకు వచ్చే సీతారామ కాలువ ద్వారా జిల్లాలోని జలాశయాలు నిండుతాయి. ఖమ్మం జిల్లాలో సుమారు 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది.
ఖమ్మం, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కాలువల నిర్మాణాలు, ఇతర పనులు చకచకా జరుగుతున్నాయి. సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని పాలేరు జలాశయంలో నింపేందుకు అవసరమైన పనులను అధికారులు మరింత వేగిరం చేశారు. ఏన్కూరు నుంచి మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం మీదుగా తిరుమలాయపాలెం మండలానికి సీతారామ ప్రాజెక్టు నీళ్లు వచ్చేలా కాలువల నిర్మాణం జరుగుతోంది.
తిరుమలాయపాలెం నుంచి కూసుమంచి మండలంలోని పాలేరు రిజర్వాయర్‌లోకి ఈ జలాలను పంపనున్నారు. ఖమ్మం జిల్లాలో ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాద్రి జిల్లాలో సీతారామ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పురోగతిని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితాసబర్వాల్ కూడా పలుమార్లు వచ్చి ప్రాజెక్టు పనులను పరిశీలించి వెళ్లారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వద్ద గోదావరి నదిపై టీఆర్ఎస్ ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టు నిర్మిస్తోంది. ప్రస్తుతం అశ్వాపురం, మొండికుంట ప్రాంతాల్లో సీతారామ ప్రాజెక్టు పనులు పూర్తికావచ్చాయి. ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం పాలేరు లింక్ కెనాల్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పాలేరు లింక్ కెనాల్‌ను రూ.1,600 కోట్లతో నిర్మిస్తున్నారు. ఏన్కూరు నుంచి పాలేరు వరకు 76.925 కిలోమీటర్ల మేర కాల్వ తవ్వకం పనులు పూర్తిచేయాల్సి ఉంది. ఇందుకోసం 2,606 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ప్రభుత్వం 758 ఎకరాల భూమి కొనుగోలు చేసింది.
సీతారామ ప్రాజెక్టు పాలేరు లింక్ కెనాల్ 13, 14 ప్యాకేజీల పనులు ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో, 15, 16 ప్యాకేజీల పనులు ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో వేగంగా సాగుతున్నాయి. తిరుమలాయపాలెం మండలంలోని తిప్పారెడ్డిగూడెం వద్ద ఆకేరుపై ఎక్విడక్ట్ నిర్మాణ పనులు కూడా 95 శాతం మేరకు పూర్తయ్యాయి. తిప్పారెడ్డిగూడెం ప్రాంతంలో 15వ ప్యాకేజీలో భాగంగా 9 కిలోమీటర్లు, 16వ ప్యాకేజీలో భాగంగా 1.5 కిలోమీటర్ల మేర కాలువ తవ్వకం పనులు పూర్తయినట్లు ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. తిరుమలాయపాలెం మండలంలోని తిప్పారెడ్డిగూడెం, కేశవాపురం, దమ్మాయిగూడెం ప్రాంతాల్లో సీతారామ ప్రాజెక్టు పాలేరు లింక్ కెనాల్ పనులు ముమ్మరంగా కొనసాగుతుండగా.. కూసుమంచి, తిరుమలాయపాలెం మండలాల్లో 20 కిలోమీటర్ల మేర పాలేరు లింక్ కెనాల్ పనులు పూర్తిచేయాల్సి ఉంది.
సీతారామ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే గోదావరి జలాలు పాలేరు రిజర్వాయర్‌లోకి రానున్నాయి. దీంతో గోదావరి, కృష్ణా నదుల అనుసంధానమైనట్లవుతుంది. కృష్ణా నది పరీవాహక ప్రాంతం కూడా గోదావరి జలాలతో స్థిరీకరణ జరుగనుంది. ఏవైనా కారణాల వల్ల పాలేరు రిజర్వాయర్‌లోకి కృష్ణా జలాలు రానిపక్షంలో ఈ రిజర్వాయర్‌ను గోదావరి జలాలతో నింపుతారు. తద్వారా దీని ఆయకట్టు భూములన్నీ సస్యశ్యామలమవుతాయి. పాలేరు వరకూ వచ్చే సీతారామ కాలువ ద్వారా జిల్లాలోని వివిధ జలాశయాలను సైతం నింపుతారు. తద్వారా ఖమ్మం జిల్లాలో సుమారు 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.
తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాల్లో సొరంగ మార్గం ద్వారా కాలువ తవ్వకం పనులకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ ప్రాంతంలోని కొన్ని గ్రామాల్లో భూముల ధరలు అధికంగా ఉన్నందున రైతులు ఆ భూములు కోల్పోయి ఇబ్బందులకు గురికాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తిరుమలాయపాలెం మండలం పాతర్లపాడు నుంచి కూసుమంచి మండలం పోచారం వరకు 8 కిలోమీటర్ల మేర సొరంగాన్ని తవ్వి ప్రధాన కాలువ నిర్మిస్తారు. దీనివల్ల 600 ఎకరాల భూమిని రైతులు కోల్పోయే అవకాశం ఉండదు. ప్రభుత్వానికి కూడా రూ.108 కోట్ల వ్యయం ఆదా అవుతుంది.
సీతారామ ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తయితే గోదావరి జిలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం కానుంది. జిల్లాలో 6 లక్షల ఎకరాలకు పైగా పంట భూములకు సాగునీటి వసతి అందుతుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. అందుకు తగినట్లుగానే నిధులు కేటాయించారు. పనులను త్వరితగతిన పూర్తిచేసేందుకు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, జిల్లా ఉన్నతాధికారులు కృషిచేస్తున్నారు.
-తాతా మధు, ఎమ్మెల్సీ
జిల్లాలో సీతారామ ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. పాలేరు లింక్ కెనాల్ తవ్వకం పనులు తిరుమలాయపాలెం మండలంలో చురుకుగా కొనసాగుతున్నాయి. తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాల్లో రైతుల నుంచి భూమిని సేకరించాల్సి ఉంది. అయితే వారు తమ పంట పొలాలు కోల్పోకుండా ఈ మండలాల్లో 8 కిలోమీటర్ల మేర సొరంగ మార్గం ద్వారా కాలువ తవ్వకం పనులు చేపడుతున్నాం.
-బానాల రమేశ్‌రెడ్డి, ఇరిగేషన్ డీఈఈ