తిరుమలాయపాలెం, నవంబర్ 13: మండలంలోని కాకరవాయిలో ఆదివారం మున్నురు కాపు ఆత్మీయ వనభోజన కార్యక్రమం జరిగింది. శివారు సంగమేశ్వరస్వామి ఆలయం వద్ద జరిగిన ఈ వన సమారాధనలో సాయంత్రం వరకు అందరూ ఉల్లాసంగా ఆడిపాడారు. అనంతరం సహపంక్తి భోజనాలు చేశారు. కొలిశెట్టి భిక్షం, మధు తదితరులు పాల్గొన్నారు.
చింతకాని, నవంబర్ 13: మండల పరిధిలోని వందనం గ్రామ సమీపంలోని శివాలయ వరణలో జంగమ సంక్షేమ జిల్లా సంఘం ఆధ్వర్యంలో జరిగిన వన సమారాధనకు ప్రత్యేక అతిథిగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వన సమారాధనలు ఐక్యతకు దోహదం చేస్తాయని పేర్కొన్నారు. అనంతరం పురాతన స్వయంభు రామలింగేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రైతుబంధు సమితి మండల కన్వీనర్ కిలారు మనోహర్, సొసైటీ చైర్మన్ కొండపల్లి శేఖర్‌రెడ్డి, సర్పంచ్ కోరిపల్లి సునిత, నాయకులు అంకిరెడ్డి రాఘవరెడ్డి, నారపోగు వెంకటేశ్వర్లు, కోరిపల్లి శ్రీను, కార్యకర్తలు ఉన్నారు.
చింతకాని, నవంబర్ 13: మండల పరిధిలోని నాగులవంచలోని శ్రీఆదర్శ ఉన్నత పాఠశాలలో ఆదివారం విద్యార్థులు వన సమారాధన జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ బోడేపూడి కిరణ్‌కుమార్ మాట్లాడుతూ.. సహపంక్తి భోజనాలు, వన సమారాధనలు విద్యార్థుల్లో మానసిక, శారీరక ఉల్లాసానికి దోహదం చేస్తాయని పేర్కొన్నారు. విద్యార్థులు కలిసి ఉల్లాసంగా ఆటలు ఆడుతూ నృత్యాలు చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు చావా అరుణ్‌కుమార్, రైతుబంధు సమితి గ్రామ కన్వీనర్ వంకాయలపాటి సత్యనారాయణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కూసుమంచి, నవంబర్ 13: కూసుమంచి మండలం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆదివారం కార్తీకమాస వన సమారాధన శివాలయంలో జరిగింది. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వన సమారాధనతోపాటు సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. కొత్తూరు కిశోర్ కుమార్, భోనగిరి రాజేంద్రప్రసాద్, అర్వపల్లి సత్యం, కృష్ణారావు పాల్గొన్నారు.