ఖమ్మం కల్చరల్, నవంబర్ 7 : కోటి కాంతుల కార్తీకం దేదీప్యమై వెలుగొందింది. పవిత్ర కార్తీక మాసం సోమవారం పౌర్ణమి తిథిలో సాయంత్రం నుంచి దీపారాధనలతో భక్తకోటి పరవశించింది. మంగళవారం చంద్రగ్రహణం ఉండటంతో ఉదయం నుంచే ఆలయాలను మూసి వేయనున్నారు. దీంతో సోమవారం రాత్రి పలు ఆలయాలు దీపారాధనలతో కళకళలాడాయి. వేనవేల దీపాల దొంతరల కాంతులు.. విద్యుత్ దీపాల వెలుగులు.. భక్తకోటి ఆధ్యాత్మిక, భక్తి సౌరభాలు వెరసి కార్తిక పౌర్ణమి కాంతిమయం చేసింది. పవిత్ర పుణ్య స్నానం, ఉపవాసం, దీపారాధనలు, శివకేశవారాధనలు, వ్రతాలు, ఉసిరి, తులసి చెట్ల పూజలు, గోపూజలు, ఆకాశదీపాలు, జ్వాలాతోరణాలు, అఖండ దీపారాధనలతో కార్తిక పౌర్ణమి వేనవేల కాంతులతో దేదీప్యమైంది.
కార్తీక సోమవారం ఆలయాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీపారాధనలు చేశారు. కూసుమంచి, తీర్థాల, పెనుబల్లి, కారేపల్లి, మధిర, ఖమ్మంలోని శివాలయాలు ‘ఓం నమఃశ్శివాయ’ పంచాక్షరి మంత్రంతో మార్మోగాయి. శివాలయాల్లో భోళాశంకరుడిని దర్శించుకుని, అభిషేకాలు, అర్చనలు , శివపూజలు చేశారు. శివాలయాల్లో రుద్రాభిషేకాలు, బిల్వదళార్చనలతో త్రినేత్రుడిని ప్రసన్నం చేసుకున్నారు. వేంకటేశ్వరస్వామి, ఆంజనేయస్వామి, రామాలయాలు ఇతర వైష్ణవాలయాలు ‘ఓం నమోనారాయణ’ అష్టాక్షరి మంత్రం, విష్ణు సహస్ర నామ పారాయణాలతో మార్మోగాయి.
భక్తులతో పోటెత్తిన ఆలయాలు
ఖమ్మం గుంటుమల్లేశ్వరస్వామి ఆలయానికి భక్తులు తరలివచ్చి స్వయంభు స్వామి దర్శనానికి బారులు తీరారు. ఉసిరి, తులసి చెట్ల వద్ద దీపాలు వెలిగించి ఆ చెట్లను పసుపు, కుంకుమలతో పూజలు చేశారు. సాయంత్రం వేళల్లో శివాలయాల్లో దేదీప్యమానంగా ప్రజ్వరిల్లిన జ్వాలాతోరణాల నుంచి దాటుతూ భక్తులు తరించారు. సంవత్సరం మొత్తం దీపాలు వెలిగించిన పుణ్యం దక్కేవిధంగా 365 వత్తులను వెలిగించి తరించారు. దీంతో సంవత్సరంలో ఏఒక్క రోజు దీపం పెట్టలేని పరిస్థితి వచ్చినా, 365 వత్తుల దీపారాధనలతో పరిహారం అవుతుందని భక్తుల నమ్మకం. ప్రాచీన దివ్యక్షేత్రం స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. భక్తులు స్వామిని దర్శించుకుని దీపారాధనలు, అర్చనలతో తరించారు. వైరారోడ్లోని పవనసుత జలాంజనేయ స్వామి ఆలయం, సుగ్గలవారితోటలోని కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయం, బ్రాహ్మణ బజారు శివాలయంతోపాటు పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.. ఆలయాలు, ఇండ్ల ముంగిట వెలిగిన దీపోత్సవంతో పున్నమి కాంతులు విరజిమ్మాయి.