రఘునాథపాలెం, నవంబర్ 5 : ఖమ్మం నగరంలోని ఖానాపురంలో రూ.4.50 కోట్లు, వీడీవోస్ కాలనీలో రూ.4.50 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న సమీకృత వెజ్- నాన్‌వెజ్ మార్కెట్ల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. శనివారం నగర మేయర్ పునకొల్లు నీరజ, నగరపాలక కమిషనర్ ఆదర్శ్ సురభితో కలిసి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆయా మార్కెట్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకరావాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో జాప్యం లేకుండా చూడాలని, మార్కెట్ ప్లాన్ ప్రకారం పనులు జరగాలన్నారు. ఖమ్మం నగర ప్రజల సౌకర్యార్థం పండ్లు, కూరగాయలు, మాంసాహారం, చేపలు వంటి నిత్యావసర సరుకులన్ని ఒకేచోట అందుబాటులో ఉంచాలన్న సంకల్పంతో చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అధునాతన హంగులతో సమీకృత వెజ్- నాన్‌వెజ్ మార్కెట్లను ప్రజల ముంగిట ఉంచనున్నట్లు పేర్కొన్నారు. వీడీవోస్ కాలనీలోని 2.01ఎకరాల్లో ఉన్న మార్కెట్లో 65 వెజ్ స్టాల్స్, 23 ఫ్రూట్ స్టాల్స్, 46 నాన్‌వెజ్ స్టాల్స్ మొత్తం 134స్టాల్స్‌తో అందుబాటులో ఉంటుందన్నారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్, డీఈ స్వరూపారాణి, ఏఈ నవ్యజ్యోతి, కార్పొరేటర్ కర్నాటి కృష్ణ, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, బత్తుల మురళి పాల్గొన్నారు.
రూ.25.65 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత
ముఖ్యమంత్రి సహాయనిధి ఆపత్కాలంలో పేదలకు అండగా నిలుస్తున్నదని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు రూ.25.65 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను తన క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గడిచిన ఏనిమిదేళ్లలో సీఎంఆర్ఎఫ్ కింద 3,808మందికి రూ.16.11 కోట్లు పంపిణీ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. మేయర్ నీరజ, కార్పొరేటర్లు పసుమర్తి రామ్మోహన్, పగడాల నాగరాజు, పైడిపల్లి సత్యనారాయణ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అజ్మీరా వీరూనాయక్ పాల్గొన్నారు.
వెంకటాయపాలెంలో అభివృద్ధి పనులు ప్రారంభం
రఘునాథపాలెం మండలంలోని ప్రతి గ్రామాన్ని శోధించి మరీ అభివృద్ధి చేశామని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. వీ వెంకటాయపాలెం గ్రామంలో రూ.53 లక్షల వ్యయంతో చేపట్టిన పనులను మంత్రి ప్రారంభించారు. ఆసరా పథకం ద్వారా మంజూరైన పింఛన్‌కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. మంత్రి మాట్లాడుతూ ఒకప్పుడు వీ వెంకటాయపాలెం ఎలా ఉంది.. ఇప్పుడు ఎలా ఉన్నది ప్రజలు గుర్తించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక అత్యధిక నిధులు కేటాయించి గ్రామాన్ని అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. గ్రామానికి వచ్చిన మంత్రికి టీఆర్ఎస్ నాయకులు ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో డీఆర్డీవో విద్యాచందన, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అజ్మీరా వీరూనాయక్, సర్పంచ్ రావెళ్ల మాధవి, మాజీ జడ్పీటీసీ కుర్రా భాస్కర్‌రావు, ఆత్మ చైర్మన్ లక్ష్మణ్ నాయక్, ఏఎంసీ డైరెక్టర్ జంగాల శ్రీనివాసరావు, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు తొలుపునూరి దానయ్య, రామోజీ, నరేశ్, శ్రీనివాస్, లాల్‌సింగ్, చెరువుకొమ్ము తండా సర్పంచ్ బానోతు మంగమ్మ, వేపకుంట్ల సర్పంచ్ ధారా శ్యాం పాల్గొన్నారు.