కొత్తగూడెం అర్బన్, నవంబర్ 2 : కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో బస్తీ దవాఖాన ఏర్పాటుకు వెంటనే చర్యలు చేపట్టాలని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని 11, 6, 12, 35, 24, 33, 34వ వార్డుల్లో విస్తృతంగా పర్యటించి అభివృద్ధి పనులను తనిఖీ చేసి సత్వరం పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 11వ వార్డు చిట్టిరామవరంలో ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. గ్రామస్తులను సమస్యలు అడిగి తెలుసుకొని పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. మోడల్ అంగన్వాడీ కేంద్రంగా తయారు చేసేందుకు మరమ్మతులు చేపట్టాలని, వాల్ పెయింటింగ్స్ వేయించాలని, అంగన్వాడీ కేంద్రంలో న్యూట్రీగార్డెన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
అంగన్వాడీ కేంద్రంలో గర్భిణులకు సీమంతం నిర్వహించారు. 12వ వార్డులో నిర్మిస్తున్న వైకుంఠధామం పనులను పరిశీలించారు. వైకుంఠధామంలో మంచినీరు, మరుగుదొడ్లు, ఏర్పాటు చేయాలని, గ్యాస్ దహనవాటికను పరిశీలించి ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశించారు. 35వ వార్డులో నిర్మిస్తున్న సఖి కేంద్రాన్ని, రేడియాలజీ విభాగపు భవన పనులను తనిఖీ చేశారు. పనులను వేగవంతం చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. సఖి కేంద్రం నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయని, కాంట్రాక్టర్‌కు నోటీసులు జారీ చేయాలని పీఆర్ ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు.
24, 25వ వార్డుల్లో నిర్మిస్తున్న పార్కు పనులను తనిఖీ చేశారు. 24వ వార్డులో యోగా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. 33, 34వ వార్డుల్లో నిర్మిస్తున్న కూరగాయలు, మాంసపు మార్కెట్ నిర్మాణ పనులను పరిశీలించి పనుల జాప్యంపై కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వెంట చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, కమిషనర్ నవీన్‌కుమార్, పీఆర్ ఈఈ సుధాకర్, సీడీపీవో లెనీనా, తహసీల్దార్ రామకృష్ణ, టీపీవో ప్రభాకర్, ఏఈలు రాము, సాహితి, కౌన్సిలర్లు శ్రీను, విజయలక్ష్మి, బండారి రుక్మాంగధర్, సత్యభామ, రావి మమత, కాసుల ఉమారాణి పాల్గొన్నారు.