దమ్మపేట, నవంబర్ 2 : నిరుపేదలకు ఉచిత వైద్యం అందాలనే లక్ష్యంతో రాష్ర్టాన్ని ‘ఆరోగ్య తెలంగాణ’గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలతో పల్లె దవాఖానలను ఏర్పాటు చేస్తున్నదని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. బుధవారం మండల కేంద్రం దమ్మపేటతోపాటు నాగుపల్లి, పట్వారిగూడెం, ముష్టిబండ, గణేశ్పాడు పంచాయతీల్లో భద్రాచలం ఐటీడీఏ నిధులు రూ.80 లక్షలతో నిర్మించిన పల్లె దవాఖాన(ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాలు)లను ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా దమ్మపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం వద్ద ఏర్పా టు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో పల్లెజ నం ఆరోగ్యంతో ఉండాలనే సంకల్పంతో కోట్లాది రూపాయలను ఖర్చుచేసి పల్లె దవాఖానలను ఏర్పాటు చేస్తున్నారని, అందులో భాగంగా దమ్మపేట మండలంలో ఐదు పల్లె దవాఖానలను ఏర్పాటు చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు మెడిసిన్ చదివేందుకు కొత్తగా 8 మెడికల్ కళాశాలలను భద్రాద్రి కొత్తగూడెం, నాగర్కర్నూల్, మహబూబాబా ద్, సంగారెడ్డి, రామగుండం, వనపర్తి, జగిత్యాల, మంచిర్యాలలో కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించారని, వాటి ద్వారా ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కళాశాలల్లో తరగతులు సైతం ప్రారంభించుకోవడం విద్యార్థులకు వరమన్నారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు దొడ్డాకుల రాజేశ్వరరావు, దొడ్డా రమేశ్, ఎంపీపీ సోయం ప్రసాద్, వైస్ ఎంపీపీ దారా మల్లికార్జునరావు, ఐటీడీఏ డీఈ రామిరెడ్డి, జేఈ ప్రసాద్, వైద్యురాలు మాధురి, సొసైటీ చైర్మన్ రావు జోగేశ్వరరావు, ఎంపీటీసీలు కూరం కమల, రావు రమాదేవి, భాస్కరరావు, కేదాసి రాధ, సర్పంచ్, ఉప సర్పంచ్లు, మైనార్టీ సెల్ నాయకులు, దమ్మపేట పట్టణ అధ్యక్షుడు బాబు, యుగంధర్, రాంబాబు, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.