హనుమకొండ చౌరస్తా, నవంబర్ 2: ఆర్టీసీ రీజినల్ మేనేజర్లు, డిప్యూటీ రీజినల్ మేనేజర్లు, డిపో మేనేజర్లు, సంస్థ సిబ్బంది సంస్థకు లాభాలు తెచ్చేలా పనిచేయాలని సంస్థ కరీంనగర్ జోన్ ఈడీ వెంకటేశ్వర్లు ఆదేశించారు. వరంగల్లోని జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కళాశాలలో బుధవారం కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ రీజియన్లకు చెందిన ఆర్టీసీ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. సిబ్బంది నైపుణ్యాలను పెంచి, నిర్వహణ వ్యయం తగ్గిస్తూ, లాభాలు తీసుకురావాలని సూచించారు.
కార్తీక మాసంలో భక్తుల సౌకర్యార్థం పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక సర్వీసులు నిర్వహించాలన్నారు. సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, వైస్ చైర్మన్ అండ్ మేనేజంగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణే పరమావధిగా గురువారం నుంచి సంస్థ పరిధిలో ‘హెల్త్ చాలెంజ్’ నిర్వహించాలన్నారు. సమావేశంలో రీజినల్ మేనేజర్లు వి.శ్రీదేవి, కుషురుషఖాన్, ఎస్తేర్ ప్రభులత, ఉషారాణి, సుధాపరిమళ, డిప్యూటీ రీజినల్ మేనేజర్లు, వర్స్ మేనేజర్ సుగుణాకర్ పాల్గొన్నారు.