భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): మార్కెట్లో కల్తీ సరుకులు, రసాయనిక మందులు స్ప్రే చేస్తే పండిన కూరగాయలు, ఫాస్ట్ ఫుడ్ తిని, నాసిరకం వంట నూనెలతో చేసిన ఆహార పదార్థాలు తిని ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. రోజుకు మూడు పూటలు సమయానికి తీసుకోవాల్సి ఉండగా పని ఒత్తిడిగా కారణంగా కొందరు కుదిరినప్పుడు తింటున్నారు. ఇవన్నీ రోగాలకు మూలమవుతున్నాయి.
చిన్న వయస్సులోనే కొందరు బీపీ, మధుమేహం బారిన పడుతున్నారు. నిరుపేదలు, మధ్య తరగతి ప్రజలు ఈ వ్యాధుల బారిన పడితే కచ్చితంగా మెడిసిన్ వాడాల్సిందే. వారి కోసమే తెలంగాణ ప్రభుత్వం నెల నెలా బాధితుల ఇంటికే మెడిసిన్ పంపిస్తున్నది. ఒక్కొక్కరికీ సుమారు రూ.2 వేల నుంచి రూ.3 వేల విలువ చేసే మెడిసిన్‌ను ఉచితంగా పంపిణీ చేస్తున్నది. బాధితులకు నెలకు వేలాది రూపాయాలు ఆదా అవుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 63,683 మంది మధుమేహ బాధితులు, 33,430 మంది రక్తపోటు బాధితులకు ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు మెడిసిన్ అందజేస్తున్నారు.
43 రకాల రక్త పరీక్షలు ఒకేచోట..
కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఏరియా ఆసుపత్రి జిల్లా ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ అయింది. ఈ ఆస్పత్రిలోని డయాగ్నస్టిక్ సెంటర్లో సిబ్బంది 43 రకాల రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆసుపత్రి మెడికల్ కాలేజీకి అనుసంధానం కావడంతో వైద్యులు నిరంతరం అందుబాటులో ఉంటున్నారు. సర్కారు వైద్యం ప్రజలకు మరింత చేరువైంది.
ఇంటికే మందులు..
ప్రభుత్వం బీపీ, మధుమేహ బాధితులకు నెల నెలా మెడిసిన్ అందిస్తున్నది. వైద్యసిబ్బంది ఇంటికే వచ్చి మెడిసిన్ కిట్లు అందిస్తున్నారు. కిట్లలో ఏ పూటకు ఏ మెడిసిన్ వేసుకోవాలో వైద్యసిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. కిట్‌లో సమయం వారీగా మందులు తీసుకునేలా అరలు ఉన్నాయి. నేను ఎవరి సాయం లేకుండానే మెడిసిన్ వాడుతున్నాను.
-నల్లమోతు విజయలక్ష్మి, మద్దుకూరు, చండ్రుగొండ మండలం
ఉచితంగా మెడిసిన్..
బీపీ, మధుమేహ బాధితులు నిత్యం మెడిసిన్ వాడాల్సిందే. బయట అంతంత ఖరీదు చేసే మెడిసిన్ కొనుగోలు చేయడం ఆర్థిక భారం. వైద్యారోగ్యశాఖ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వైద్యపరీక్షలు నిర్వహించి సేవలు అందిస్తున్నారు. బీపీ, షుగర్ బాధితులకు ఉచితంగా మెడిసిన్ కిట్లు అందిస్తున్నాం. వైద్యపరీక్షలు నిర్వహించి వ్యాధి తీవ్రతను బట్టి సిబ్బంది మెడిసిన్ మారుస్తున్నారు.
– డాక్టర్ దయానందస్వామి, డీఎంహెచ్‌వో, కొత్తగూడెం