రఘునాథపాలెం, మార్చి 4: పొట్టచేత పట్టుకొని ఎక్కడి నుంచో వలస వచ్చిన నిరుపేదలు వారు. దొరికిన పని చేసుకుంటూ బతుకుపోరాటం సాగిస్తున్నారు. అద్దెలు కట్టలేక ఖమ్మం నగర శివారు ప్రాంతాల్లోని గుట్టలపై, కాల్వ కట్టలపై, మురికి వాడలపై ఖాళీ స్థలాల్లో తాత్కాలిక ఇళ్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నారు. ఆ గుడిసెకు ఇంటి నెంబరు రాక.. ఎండకు, వానకు గోస పడుతూ బతుకుతున్నారు. ఎప్పుడు వెళ్లగొడతారో అనే భయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుబండి లాగిస్తున్నారు. అంతేకాదు.. వారికి మౌలిక సౌకర్యాలు కరువయ్యాయి. కుళాయి నీళ్లూ అందని పరిస్థితి. దశాబ్దాలుగా సమస్యను వివరించని నాయకులు లేరు. కలవని అధికారులు లేరు. కానీ ఏ ఒక్కరూ ఆ నిరుపేదల గోడును పట్టించుకోలేదు. ఏ దిక్కూ లేకుండా ఏ ఆధారమూ లేని ఇళ్లల్లో ఉంటున్న ఖమ్మం నగర పేదలకు తెలంగాణ సర్కార్‌లో శాశ్వత పరిష్కారం లభించింది. ఖమ్మం నగర చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు కట్టుకొని మౌలిక సౌకర్యాలు లేకుండా దుర్భరంగా జీవిస్తున్న వేలాదిమంది నిరుపేదల విషయం తెలుసుకున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ వారి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ఆలోచన చేశారు. నగర చుట్టుపక్కల ప్రాంతాల్లో నివాసం ఉంటున్న నిరుపేదల వివరాల సేకరణ బాధ్యతను ఖమ్మం అర్బన్ తహసీల్దార్ మేదరమెట్ల శైలజకు అప్పగించారు. తన సిబ్బందితో రంగంలోకి దిగిన తహసీల్దార్.. నగరంలో తాత్కాలిక ఇళ్లు కట్టుకొని ఉంటున్న పేదల జాబితాను తయారు చేశారు. మంత్రి ఆదేశాల మేరకు వెంటనే వారు కట్టుకొని ఉంటున్న ఇళ్లకు పొజీషన్ పట్టాలు పంపిణీ చేస్తున్నారు.
ఇప్పటికే నగరంలో 2వేల పైచిలుకు నిరుపేదలు ఉంటున్న ఇళ్లకు పొజిషన్ పట్టాలు పంపిణీ చేశారు. 12 ఆవాస ప్రాంతాల్లోని ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు కట్టుకొని ఎలాంటి ఆధార పత్రాలు లేకుండా జీవనం సాగిస్తున్నట్లు రెవెన్యూ అధికారులు తమ సర్వేలో గుర్తించారు. వారి పూర్తి వివరాల జాబితా తయారు చేసి పొజిషన్ పట్టాల తయారీలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఖమ్మం 4వ డివిజన్ పరిధిలో రాజీవ్‌నగర్ గుట్టలో 77 మందికి, 31వ డివిజన్ పత్తి మార్కెట్ ఏరియాలో ప్రాంతంలో 138 మందికి, 58వ డివిజన్ దొరన్నకాలనీలో 140 మందికి, శ్రీనివాసనగర్ కాల్వకట్ట ప్రాంతంలో 450 మందికి, గొల్లగూడెంలో 362 మందికి పొజీషన్ పట్టాలు అందజేశారు. ఇవిగాక అల్లీపురం, కొత్తగూడెం, గొల్లగూడెం, ఎల్బీనగర్, కాలనీలతో కలుపుకొని మొత్తం 2వేలకి పైగా నిరుపేదల ఇళ్లకు ఆస్తి హక్కు పత్రాలను పంపిణీ చేసి శాశ్వత హక్కులను కల్పించారు.
తాము నివాసం ఉంటున్న ఇళ్లు ఎప్పటికీ తమ సొంతం కావనే ఆలోచనల్లో ఉన్న పేదల చేతికి పొజీషన్ పట్టాలు అందిన సమయంలో వారి ఆనందాలకు అవధుల్లేకుండా పోయాయి. మంత్రి అజయ్‌కుమార్ స్వయంగా తమ ప్రాంతానికే వచ్చి తమ సమస్యకు పరిష్కారం చూపినందుకు ఉబ్బితబ్బిబ్బయ్యారు. తమ వాడల్లో పట్టాలు పంపిణీ చేసి తమతో సహపంక్తి భోజనం చేయడంతో వారు అమితానందం వ్యక్తం చేస్తున్నారు.
సాధారణంగా ఖమ్మం అర్బన్ పరిధిలో కార్యాకలాపాలే తలకుమించిన భారం. అందునా.. కొత్త పని పడితే కత్తిమీద సామే. అయినా మంత్రి ఆదేశాలతో కదిలిన ఖమ్మం అర్బన్ రెవెన్యూ అధికారులు నగరంలోని 12 ప్రాంతాల్లో పేదలను గుర్తించి వారికి పొజీషన్ పట్టాలను పంపిణీ చేయడంలో సఫలీకృతులయ్యారు. నెల రోజులుగా తహసీల్దార్ శైలజ.. గిర్దావర్లను వెంటబెట్టుకొని కిందిస్థాయి రెవెన్యూ సిబ్బందితో కలిసి పేదల వాడల్లో పర్యటించి అర్హుల జాబితాను గుర్తించి పట్టాల తయారీకి ఉపక్రమించారు. ఫలితంగా 2వేల పైచిలుకు పేదల ఇళ్లకు పట్టాలను అందించడంలో విజయం సాధించారు.
ఏన్నో ఏళ్లుగా పేదలు ఉంటున్న ఇళ్లకు పట్టాలు పంచినప్పుడు వారి మోముల్లో ఆనందాన్ని చూశాక చాలా సంతోషం అనిపించింది. ఇది మంత్రి అజయ్‌కుమార్ సహకారంతోనే సాధ్యమైంది. నిరుపేదల ఇళ్లకు పొజిషన్ పట్టాల కోసం జాబితాను తయారు చేసే క్రమంలో మంత్రి అజయ్ ఎప్పటికప్పుడు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకునేవారు. అర్హులందరికీ పొజీషన్ పట్టాలు అందజేస్తాం.
-మేదరమెట్ల శైలజ, ఖమ్మం అర్బన్ తహసీల్దార్