ముదిగోండ, మార్చి 2: మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క పాదయాత్రల పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు పేర్కొన్నారు. మండలంలోని మల్లారం గ్రామంలో కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం నుంచి 35 కుటుంబాల వారు బుధవారం కమల్‌రాజు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధిపై గత ఏడేళ్లలో ఒక్కసారైనా సీఎం కేసీఆర్‌ను కలిశారా? అని ప్రశ్నించారు. ఓటమి భయంతోనే ఆయన పాదయాత్రలు చేస్తున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పాలనతో రానున్న ఎన్నికల్లో మధిర గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని స్పష్టం చేశారు. మధిర ప్రజల సమస్యలపై ఏనాడూ పట్టించుకోకుండా రాష్ట్ర, దేశ రాజధానుల్లో ఎక్కువగా బస చేసే దళిత దొరకు ఉన్నట్టుండి పాదయాత్రలు ఎందుకు గుర్తొచ్చాయని ప్రశ్నించారు. ఇలాంటి పాదయాత్రలు ఎవరికోసమో ప్రజలకు తెలుసుని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఉండడం రాష్ట్ర ప్రజల అదృష్టమన్నారు. దళితబంధు, రైతుబంధు, హరితహారం, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, డబుల్ బెడ్ రూం ఇళ్లు, రైతుబీమా వంటి సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రథమస్థానంలో ఉందన్నారు. ఆ ఘనత సీఎం కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ కంచుకోటలు బద్ధలవుతున్నాయన్నారు. దళితుబంధు కోసం రానున్న బడ్జెట్లో రూ.30 వేల కోట్లు కేటాయించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారని గుర్తుచేశారు. టీఆర్ఎస్ పాలనను చూసి ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు, నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వాచేపల్లి లక్ష్మారెడ్డి, ఎంపీపీ సామినేని హరిప్రసాద్, రైతుబంధుసమితి అధ్యక్షుడు పోట్ల ప్రసాద్, మండల, గ్రామ శాఖ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.