ఖమ్మం అర్బన్, మే 11: ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎప్‌సెట్-2025) ఫలితాల్లో ఖమ్మం జిల్లా విద్యార్థులు రాణించారు. రాష్ట్రస్థాయిలో ఇంజినీరింగ్‌లో 28, 61, 77, 102, 109, 110 ర్యాంకులు సాధించి జిల్లా ఖ్యాతిని మరోసారి చాటారు. ఇంజినీరింగ్ విభాగంలో అత్యుత్తమ ర్యాంకులతో మెరిశారు. ఫలితాలు ఏవైనా ర్యాంకులు తమవే అనేలా ఆదివారం విడుదలైన తెలంగాణ ఎప్‌సెట్ ఫలితాల్లో విజయఢంకా మోగించారు.
ఇంటర్, జేఈఈ ఫలితాల్లో సత్తా చాటినట్లే.. పోటీ పరీక్ష అయిన ఎప్‌సెట్‌లోనూ అత్యుత్తమంగా రాణించి జిల్లా విద్యా పరిమళాలాలను రాష్ట్రం నలుదిక్కులా వ్యాపింపచేశారు. తెలంగాణ ఏర్పాటు నుంచి జిల్లా విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తూ వస్తున్నారు. ఇటీవల జరిగిన ఆన్లైన్ ఎప్‌సెట్‌లో ఖమ్మం జిల్లాలో ఇంజినీరింగ్ విభాగంలో 10,014 మంది, ఫార్మసీ అండ్ అగ్రికల్చర్లో 4,824 మంది, భద్రాద్రి జిల్లాలో ఇంజినీరింగ్‌లో 778 మంది, ఫార్మసీ అండ్ అగ్రికల్చర్లో 388 మంది పరీక్షలు రాశారు.
150లోపు ఆరు ర్యాంకులు..
ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ హబ్‌గా హైదరాబాద్ తర్వాత ఖమ్మానికి పేరుంది. ఆ పేరును ఎప్పటికప్పుడు జిల్లా విద్యార్థులు నిలుపుతూనే వస్తున్నారు. ఈసారి ఎప్‌సెట్ ఫలితాల్లో 150లోపు ఆరు ర్యాంకులు సాధించి అదరహో అనిపించారు. ఇటీవల కాలంలో ఖమ్మం జిల్లాకు 50లోపు ర్యాంకు రాలేదు. ఎప్‌సెట్-25లో రెండెంకల లోపు ర్యాంకులతో ప్రైవేట్ కళాశాలలు సత్తా చాటాయి. అయితే, ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థుల్లో హైదరాబాద్‌లోని కార్పొరేట్ కళాశాలల్లో చదివి 100లోపు ర్యాంకులు సాధించిన వారు కూడా ఉన్నారు.
నేరుగా ఖమ్మంలోని కళాశాలల్లోనే చదివిన విద్యార్థులు 28, 61, 77, 102, 109, 110 వంటి ఉత్తమ ర్యాంకులను ఎప్‌సెట్-25లోనే నమోదు చేశారు. ఇంటర్ ఫలితాల్లో టాప్ మార్కులతో రాణించగా.. జేఈఈ ఫలితాల్లోనూ అదే స్థాయిను కొనసాగించింది. ఇప్పుడు విడుదలైన ఎప్‌సెట్ ఫలితాల్లోనూ ఆశించిన ఫలితాలతో విజయభేరి మోగించిన విద్యార్థులు, విద్యాసంస్థల బాధ్యులు రెట్టింపు ఉత్సాహంతో ఉన్నారు.
ప్రైవేట్ కళాశాలల్లో..
ఎప్‌సెట్-25 ఫలితాల్లో ఖమ్మం జిల్లాలోని ప్రైవేట్ కళాశాలల విద్యార్థులు తమ హవాను కొనసాగించాయి. 28, 61 ర్యాంకులను శ్రీచైతన్య విద్యార్థులు వీ.కుషాల్, వీ.నిషాంత్ సాధించినట్లు ఆ కళాశాల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్ తెలిపారు. ఇంజినీరింగ్‌లో 77, అగ్రికల్చర్/ ఫార్మసీలో 120 ర్యాంకులకు హార్వెస్ట్ విద్యార్థులు బీ.సాయిచరణ్ రాణి ఉమా అలేఖ్య సాధించినట్లు ఆ కళాశాల కరస్పాండెంట్ పోపూరి రవిమారుత్ తెలిపారు. ఇంజినీరింగ్‌లో 102, 109, 110 ర్యాంకులను న్యూవిజన్ విద్యార్థులు పీ.సంహిత, ఎం.ఆకాంక్ష, ఆర్.శీతల్ సాధించినట్లు ఆ కళాశాల చైర్మన్ సీహెచ్‌జీకే ప్రసాద్ వివరించారు.