ఖమ్మం, జూన్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఖమ్మం నగరంలో జీవో 58 కింద భూ క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్న 9వేల మందికి పట్టాలను వెంటనే ఇవ్వాలని రాష్ట్ర ఐటీ పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ఖమ్మంలో రూ.30 కోట్లతో నిర్మించిన పురపాలక సంఘం భవనాన్ని శనివారం ప్రారంభించిన అనంతరం మున్సిపల్ కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల కోసం పనిచేసేదిగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి గుర్తింపు ఉందన్నారు.
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఖమ్మం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని, ప్రజలు పూర్తిగా అభివృద్ధి వైపు, పార్టీ వైపు నిలిచారని పేర్కొన్నారు. గత ఖమ్మానికి, ప్రస్తుత ఖమ్మానికి పోలికే లేదని, భవిష్యత్‌లో ఖమ్మం మహా నగరంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. నగరంలో ఎనిమిదేండ్లలో సుమారు వెయ్యి కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేశామని, వాటిని విస్తృతంగా ప్రచారం చేయాలని, ఇందుకు సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలని కార్పొరేటర్లకు సూచించారు.
టీఆర్ఎస్ సభకు వేల మంది ప్రజలు వచ్చి ఆదరిస్తుంటే కొన్ని ప్రచార సాధనాలు, పత్రికలకు కనబడటం లేదని, సభలో ఒక్కరు గొడవ చేస్తే మాత్రం దానిని ప్రధాన శీర్షికగా చేసే పరిస్థితి ఉందన్నారు. అయినా ప్రజల్లో టీఆర్ఎస్కు ఉన్న నమ్మకాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, ప్రజలకు నిజాలు చెప్పాల్సిన అవసరం పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలకు ఉందని పేర్కొన్నారు. ఖమ్మంలో జరిగిన అభివృద్ధిని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చూపించాలని, త్వరలో సీఎం కేసీఆర్‌ను నగరానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తానని మంత్రి పేర్కొన్నారు.
టీఆర్ఎస్ సంప్రదాయాలు, పద్ధతులకు కట్టుబడి ఉండే పార్టీ అని, టేకులపల్లిలో క్రీడా ప్రాంగణాన్ని ఆ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ చేతనే ప్రారంభింపజేశామన్నారు. అదేవిధంగా జిల్లా పరిషత్ వద్ద ఫుట్‌పాత్ ప్రారంభోత్సవాన్ని సీపీఐ కార్పొరేటర్ ైక్ల్లెమెంట్తో చేయించామన్నారు. ఖమ్మం నగరం రాష్ట్రంలోని అన్ని పురపాలక సంస్థలకు ఆదర్శప్రాయంగా నిలుస్తుందని, అభివృద్ధిలో ఖమ్మంతో మరే నగరపాలక సంస్థ పోటీ పడలేనంత అగ్రస్థానంలో ఉందని మంత్రి పేర్కొన్నారు.
గజ్వేల్, సిరిసి ల్ల, సిద్ధిపేట కంటే ఖమ్మం మున్సిపాలిటీ అన్నింట్లో అగ్రగామిగా ఉందన్నారు. సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, మేయర్ పునుకొల్లు నీరజ, కలెక్టర్ వీపీ గౌతమ్, కమిషనర్ ఆదర్శ్ సురభి, ము న్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్సత్యనారాయణ పాల్గొన్నారు.