ఖమ్మం నగరానికి నలుదిక్కులా నాలుగు వైకుంఠధామాలను నిర్మించారు. వాటిలో మూడుచోట్ల పూర్తయ్యాయి. మరోచోట పనులు జరుగుతున్నాయి. నగరానికి పడమర దిక్కున కాల్వొడ్డు శ్మశానవాటికను ఆధునీకరించారు. ఉత్తరాన బల్లెపల్లిలో రూ.4 కోట్లతో, దక్షిణాన ప్రకాశ్‌నగర్ వద్ద రూ.2 కోట్లతో వైకుంఠధామాలు నిర్మించారు. కొత్తగూడెంలో తూర్పు వైపున రూ.2 కోట్లతో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ప్రతి వైకుంఠధామంలో 20అడుగుల శివుడి విగ్రహం, దహనవాటికలు, సీసీ రోడ్డు, సెంట్రల్ లైటింగ్, గ్రీనరీ ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మనిషి ఆఖరి మజిలీ కష్టాలకు ఫుల్స్టాప్ పడడంతో నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నగరాభివృద్ధికి కృషిచేస్తున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు ధన్యవాదాలు చెబుతున్నారు.
– ఖమ్మం, మే 29
పేదవాడైనా.. సంపన్నుడైనా చివరికి చేరాల్సిందే అక్కడికే. కాటిలో బూడిదై ఏటిలో కలిసే మనిషి చివరిమజిలీకి ఇబ్బంది పడకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా వైకుంఠధామాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం ప్రత్యేక నిధులు కేటాయించారు. గతంలో ఆఖరి మజిలీకి అష్టకష్టాలు పడేవారు. ముళ్ల చెట్లల్లో ఊరికి దూరంగా.. దుర్గంధం వెదజల్లే చోట దహనం చేసేది. తెలంగాణ ప్రభుత్వం అన్ని హంగులతో వైకుంఠధామాలను నిర్మించింది. దీంతో ఆఖరి మజిలీ కష్టాలు తీరాయి.
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చొరవతో ఖమ్మం నగరానికి నలుదిక్కులా నాలుగు వైకుంఠధామాలను నిర్మించారు. వాటిలో మూడుచోట్ల పూర్తయ్యాయి. మరోచోట పనులు జరుగుతున్నాయి. నగరానికి పడమర దిక్కున కాల్వొడ్డు శ్మశానవాటికను ఆధునీకరించారు. ఉత్తరాన బల్లెపల్లిలో రూ.4 కోట్లతో, దక్షిణాన ప్రకాశ్‌నగర్ వద్ద రూ.2 కోట్లతో వైకుంఠధామం నిర్మించారు. కొత్తగూడెంలో తూర్పు వైపున రూ.2 కోట్లతో నిర్మాణ పనులు జరుగుతున్నాయి..
నైజాం కాలంలో కాల్వొడ్డు వద్ద మున్నేరు ఆనుకుని హిందూ శ్మశాన వాటికను ఏర్పాటు చేశారు. ఆనాడు ఖమ్మం పట్టణ జనాభాకు అనుకూలంగా ఈ ప్రదేశాన్ని ఎంపిక చేశారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రత్యేక చొరవతో నగరపాలక సంస్థ నిధులు రూ.75 లక్షలతో వైకుంఠధామాన్ని సకల హంగులతో తీర్చిదిద్దారు. శ్మశాన వాటికలో నూతనంగా 20 అడుగుల ఎత్తుగల శివుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 5 దహన వేదికలను నిర్మించారు. దహన వేదికలకు గ్రానైట్, దహనం చేయడానికి 5 స్టాండులను ఏర్పాటు చేశారు. దహన సంస్కరాలు పూర్తి అయ్యే వరకు వృద్ధులు, వికలాంగులు కూర్చోవడానికి ప్రత్యేక గ్యాలరీని నిర్మించారు. వీటితోపాటు మహిళలు, పురుషులకు వేర్వేరుగా మరుగుదొడ్లు నిర్మించారు. తలనీలాల కోసం ప్రత్యేక భవనాలు నిర్మించారు. సీసీ రోడ్లు నిర్మించి, సెంట్రల్ లైటింగ్‌ను ఏర్పాటు చేశారు. శ్మశాన వాటిక చుట్టూ ప్రహరీ నిర్మించి, ముఖద్వారాన్ని నిర్మించారు. గ్రీనరీని ఏర్పాటు చేసి మొక్కలు నాటారు. ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేయడానికి పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశారు.

నగర పరిధిలోని బల్లేపల్లిలో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో అన్ని హంగులతో వైకుంఠధామం నిర్మించారు. చుట్టూ ప్రహరీ, శవదహనాల కోసం మూడు వేదికలు, విశాలమైన రెండు గదులు, దహనక్రియలు వీక్షించేందుకు వీలుగా వెయిటింగ్ హాలు, అస్థికలను భద్రపరిచే గది, దశదిన కర్మల నిర్వహణకు హాలు, మహిళలు, పురుషులకు వేర్వేరుగా మరుగుదొడ్లు, స్నానపు గదులు నిర్మించారు. వైకుంఠధామం లోపల ఫౌంటేన్, భారీ శివుడి విగ్రహం, గ్రీనరీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అంతిమయాత్రలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు రూ.70లక్షలతో ఇల్లెందు ప్రధాన రహదారి నుంచి వైకుంఠధామం వరకు బీటీ రోడ్డును నిర్మించారు. చనిపోయినవారి జ్ఞాపకార్థం వైకుంఠధామంలో మొక్కలు నాటేందుకు ప్రత్యేకంగా నర్సరీని ఏర్పాటు చేశారు. దింపుడు కల్లం కోసం రెండుప్లాట్ ఫామ్‌లు నిర్మించారు. వైకుంఠధామానికి పడమర ప్రధాన ద్వారం వద్ద ఆర్చీ, చెరువులో స్నానానికి వెళ్లేందుకు తూర్పు వైపు రెండో ఆర్చీలు నిర్మించి గేటును అమర్చారు. అస్థికలు నిల్వ చేసుకునేందుకు ప్రత్యేకంగా లాకర్ ఏర్పాటు చేశారు. రూ.50 లక్షలతో విద్యుత్ దహన వాటిక ఏర్పాటు చేశారు. ససుమారు వెయ్యి చదరపు గజాల స్థలంలో మొక్కలు నాటారు.
నగరంలోని త్రీటౌన్ ప్రాంతం ప్రకాశ్‌నగర్ మున్నేరు ఒడ్డున గతంలో ఉన్న వైకుంఠధామం స్థలంలోనే నూతనంగా రూ.2 కోట్లతో వైకుంఠధామాన్ని నిర్మించారు. ఎకరం 10 కుంటల స్థలంలో దీన్ని నిర్మించారు. దహనం చేయడానికి 3 యూనిట్లు, శివుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఒక కార్యాలయ గది, పూజ కోసం ప్రత్యేక గదులు నిర్మించారు. ఆస్థికలు భద్రపరుచుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పెద్ద ఆర్చీ, ప్రహరీ నిర్మించారు. సోమవారం(ఈ నెల 30వ తేదీ) నుంచి ఈ వైకుంఠధామంలో దహన సంస్కారాలు జరుపుకునేలా ఏర్పాట్లు చేశారు.

నగరానికి తూర్పు దిక్కున ఉన్న కొత్తగూడెంలో రూ.2 కోట్లతో ఎకరం స్థలంలో మరో వైకుంఠధామాన్ని నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఖమ్మం కార్పొరేషన్ ఆధ్వర్యంలో వేగవంతంగా పనులు జరుగుతున్నాయి. మంత్రి పువ్వాడ మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులతో రెండు రోజుల క్రితం సమీక్ష నిర్వహించి త్వరితగతిన వైకుంఠధామం పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రకాశ్‌నగర్‌లో నిర్మించిన విధంగానే ఇక్కడ వైకుంఠధామాన్ని నిర్మిస్తున్నారు.
ఖమ్మం నగరానికి నలుదిక్కులా నాలుగు వైకుంఠధామాలు నిర్మించాం. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో వీటిని నిర్మించాం. ముస్లింలు, క్రైస్తవులకు సంబంధించిన శ్మశానవాటికల అభివృద్ధి, ఆధునీకరణకు నిధులు కేటాయించాం. కొన్ని చోట్ల పనులు పూర్తి చేశాం.. మరికొన్ని పూర్తి చేయాల్సి ఉంది. తెలంగాణ ప్రభుత్వం దృష్టిలో అన్ని కులాలు సమానమే.. వారి ఆచార, సంప్రదాయాలను గౌరవించేలా ఏర్పాట్లు చేస్తున్నాం..
