ఇల్లెందు రూరల్, మే 29 : రహదారులు మెరుస్తున్నాయి.. గ్రామస్తులు మురిసిపోతున్నారు.. సౌకర్యవంతంగా ప్రయాణాలు సాగిస్తున్నారు. అవును.. తెలంగాణ ప్రభుత్వంలో గ్రామీణ రహదారులకు మహర్దశ పట్టింది. అన్ని గ్రామాలకూ నిధులు కేటాయించి పనులు చేపట్టడంతో గ్రామీణ రహదారుల రూపురేఖలు మారిపోతున్నాయి. ఒకనాటి వలస పాలనలో కంకర తేలిన రోడ్లపై ఒళ్లు హూనమయ్యేలా చేసిన ప్రయాణాలను గ్రామస్తులు జ్ఞప్తికి తెచ్చుకుంటున్నారు. అవస్థల మధ్య చేసిన ప్రయాణాలను, ఇప్పుడు సౌకర్యవంతంగా సాఫీగా సాగుతున్న రాకపోకలను పోల్చుతూ చర్చించుకుంటున్నారు.
కొత్తగా నిర్మించిన బీటీ రోడ్లతో మండలంలోని అన్నారం, వేపల్లగడ్డ, మర్రిగూడెం గ్రామ పంచాయతీలకు కొత్త కళను సంతరించుకుంది. సుమారు రూ.1.06 కోట్లతో నిర్మించిన ఈ రహదారి ఆయా గ్రామాల ప్రజల రాకపోకలకు ఎంతో సౌకర్యంగా ఉంది.
మండలంలోని సుదిమళ్ల పంచాయతీలో నూతనంగా బీటీ రోడ్డు ఏర్పాటు కావడంతో ఆ రహదారి మీదుగా సాగే ప్రయాణాలకు సౌకర్యవంతంగా మారింది. సుమారు రూ.6.05 కోట్లతో తొమ్మిది కిలోమీటర్ల మేర ఈ రహదారిని నిర్మించారు. మరో 2.7 కిలోమీటర్ల మేర రోడ్డు పనులు నిలిచిపోయాయి. అటవీ శాఖ అనుమతులు ఇంకా లభించలేదని పంచాయతీ రాజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. అనుమతులు లభించగానే ఆ పనులు కూడా పూర్తి కానున్నాయి. దీంతో ఆ రహదారి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది.
అన్నారం, వేపల్లగడ్డ, మర్రిగూడెం గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించేందుకు ప్రయాణ కష్టాలు తీరాయి. ఎన్నో ఏళ్లుగా మోక్షానికి నోచుకోని ఈ రోడ్డు.. సీఎం కేసీఆర్ పుణ్యాన బీటీ రోడ్డుగా ఏర్పాటైంది. సౌకర్యవంతంగా రాకపోకలు సాగించేందుకు ఎంతో వీలుగా ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఇవి సాధ్యమయ్యాయి.
– ఊకే ఝాన్సీ, సుదిమళ్ల గ్రామస్తురాలు
సుదిమళ్ల గ్రామ పంచాయతీ నుంచి ఇల్లెందుకు రావాలంటే అప్పట్లో రోడ్లు సరిగ్గా ఉండేవి కావు. వెళ్లిరావాలంటే ఎన్నో అవస్థలు పడాల్సి వచ్చేది. ముందు భాగాన వాహనాలు వెళ్తే దట్టమైన దుమ్మూధూళి లేచి కళ్లలో పడేది. ద్విచక్ర వాహనాలపై ప్రయాణం మహా నరకంగా ఉండేది. ఇప్పుడు తొమ్మిది కిలోమీటర్ల మేర రోడ్డు వేయడంతో ప్రయాణం సులభతరమైంది.
-కృష్ణ, సుదిమళ్ల గ్రామస్తుడు
రహదారుల నిర్మాణాలు జరగడంతో గ్రామాల రూపురేఖలు పూర్తిగా మారాయి. సీఎం కేసీఆర్ హయాంలో పల్లెలకు మహర్దశ పట్టింది. నగరాలకు దీటుగా పల్లెలకూ రహదారులు ఏర్పాటయ్యాయి. రాకపోకలు ఎంతో సౌకర్యంగా మారాయి. అనుకున్న సమయానికి గమ్య స్థానాలను చేరుకోగలుగుతున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు.
-వీ.సుభద్ర, ఇల్లెందు గ్రామస్తురాలు
ఇల్లెందు మండలంలో పీఎం గ్రామ సడక్ యోజన కింద ధర్మాపురం, పూబెల్లి, సుదిమళ్ల రహదారులను రూ.648.50 లక్షలతో నిర్మించాం. డీఎంఎఫ్ నిధుల కింద అన్నారం, మర్రిగూడెం వయా వేపలగడ్డ రోడ్డును రూ.కోటితో నిర్మించాం. పోచారంతండా నుంచి పోలారం వరకు రూ.190 లక్షలు డీఎంఎఫ్ నిధులతో రోడ్డు నిర్మించాం. సుదిమళ్ల గ్రామ పంచాయతీలో 2.7 కిలోమీటరు రోడ్డు మాత్రం నిర్మించాల్సి ఉంది. అటవీశాఖ అనుమతులు లభించగానే పనులు ప్రారంభిస్తాం.
-రాజు, పీఆర్ ఏఈ, ఇల్లెందు