ఖమ్మం కల్చరల్, మే 29 : కళాకారుల గుమ్మంగా పేరున్న ఖమ్మం జిల్లా కేంద్రంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో సౌకర్యాలు కల్పించడానికి, మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. అమరజీవి అన్నాబత్తుల రవీంద్రనాథ్ కళా సాంస్కృతిక సంస్థ(ఆర్క్స్) ఆధ్వర్యంలో ఆదివారం భక్త రామదాసు కళాక్షేత్రంలో నిర్వహించిన ‘నెల నెలా వెన్నెల’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశంలో నాటకాల ప్రదర్శనకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, స్వాతంత్య్ర ఉద్యమంలో, స్వాతంత్య్రానంతరం దేశభక్తిని రగిలించేందుకు నాటక ప్రదర్శనలు తోడ్పడ్డాయన్నారు.
మూఢనమ్మకాలను పారద్రోలడానికి, సామాజిక సమస్యల పరిష్కారానికి అవగాహన, చైతన్యం కలిగించడంలో నాటకాల పాత్ర ఎంతో ఉందన్నారు. కళాక్షేత్రంలో సౌకర్యాలు మెరుగుపర్చడంతోపాటు, సమీపంలోని ఆర్డీవో ప్రాంగణంలోని కొంత స్థలాన్ని దీనికి అనుబంధంగా విస్తరింపచేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కళాక్షేత్రం అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపిస్తానని తెలిపారు. ‘థింక్’ నాటిక కళాకారులకు స్పాన్సర్స్ తరఫున పారితోషికం అందజేశారు.
సభకు ఆర్క్స్ అధ్యక్షుడు మోటమర్రి జగన్మోహన్రావు అధ్యక్షత వహించగా, ప్రధాన కార్యదర్శి అన్నాబత్తుల సుబ్రహ్మణ్యకుమార్, ఖమ్మం కళా పరిషత్ అధ్యక్ష, కార్యదర్శులు వీవీ అప్పారావు, డాక్టర్ నాగబత్తిని రవి, న్యాయవాది కొల్లి సత్యనారాయణ, మహిళా ప్రాంగణం అధికారి వేల్పుల విజేత, కాళ్ల భద్రినాథ్, వేముల సదానందం, నామ లక్ష్మీనారాయణ, రవీందర్, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. కళాకారులు మోదుగు గోవింద్, కృష్ణ, వెంకన్న, స్వప్న పలు గీతాలు ఆలపించి అలరించారు. చిన్నారి కిలారు అనన్య ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యం ఆకట్టుకుంది. హైదరాబాద్కు చెందిన సిరిమువ్వ కల్చరల్స్ కళాకారులు ప్రదర్శించిన ‘థింక్’ నాటిక ఆలోచింపజేసింది. పిల్లల పెంపకం పట్ల తల్లిదండ్రుల బాధ్యతను ఈ నాటిక ప్రతిబింబించింది.