గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. మట్టిలోని మాణిక్యాలను వెలికితీయడమే లక్ష్యంగా ప్రతి గ్రామంలోనూ క్రీడా మైదానాల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే పట్టణాలకు దీటుగా పల్లెలను సుందరంగా తీర్చిదిద్దింది. దీంతో పల్లెలు పచ్చందాలతో కళకళలా డుతున్నాయి.. గ్రామానికో వన నర్సరీ, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, ట్రాక్టర్ ఏర్పాటు చేయడంతో గ్రామాల రూపురేఖలు మారాయి. గ్రామీణ విద్యార్థులు, క్రీడాకారుల అవసరాలకు అనుగుణంగా క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తోంది. ఈ క్రీడా ప్రాంగణాల్లో అథ్లెటిక్ ట్రాక్, ఫుట్బాల్ కోర్టు, క్రికెట్ ప్రాక్టీస్ కోర్టు వంటివి నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో గ్రామస్తులు, క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం, మే 29 (నమస్తే తెలంగాణ) : ఎంత పెద్ద చదువులు చదువుకున్నా ఉత్సాహం ఉల్లాసం కోసం ప్రతి విద్యార్థీ ఏదో ఒక ఆటలో నైపుణ్యం కలిగి ఉండడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఆట స్థలాలు లేకపోయినా ఉన్న వాటిలోనే సర్దుకొని మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ ఎదిగిన క్రీడాకారులు రాష్ట్రస్థాయిలోనూ సత్తాను చాటుతున్నారు. ఇందుకోసం క్రీడా పాఠశాలలను కూడా తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది.
కానీ క్రీడాస్థలాలు లేక ఇంకా చాలామంది విద్యార్థులు ప్రతిభను చాటలేకపోతున్నారు. తమ గ్రామాలకే పరిమితమవుతున్నారు. ఇక నుంచి ఇలాంటి సమస్యలకు చరమగీతం పలకడం కోసం తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 5వ విడత పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో ప్రతి పల్లె ముంగిటకూ క్రీడా స్థలాన్ని తేవాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రతి పల్లెలోనూ ప్రభుత్వ స్థలంలో క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. ఎకరం స్థలంలో మైదానం ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసింది.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాటికి ప్రతి పల్లెలోనూ ఆటస్థలాలు నిర్వహణ పూర్తి కావాలని ప్రభుత్వం నిర్ణయించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,280 ఆవాస ప్రాంతాల్లో క్రీడా స్థలం కోసం భూమిని సేకరించారు. ఇప్పటికే ఆయా మండలాల్లో రెవెన్యూ అధికారులు స్థానిక ఎంపీడీవోలకు భూమిని అప్పగించారు. ఎకరం స్థలంలో అతి పెద్ద మైదానాలను ఏర్పాటు చేసేందుకు పల్లె ప్రగతిలో నిధులు మంజూరు చేశారు. ప్రతి మైదానానికీ రూ.5 లక్షల నిధులను కేటాయించారు. ఆయా మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించి పనులను వేగవంతం చేయాలని భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ సూచించారు.
ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో ఉన్న క్రీడా మైదానాలను మరిన్ని హంగులతో విస్తరించనున్నారు. భద్రాద్రి జిల్లాలో ఉన్న నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 16 క్రీడా మైదానాలను ఎంపిక చేశారు. ఒక్కో మైదానానికి పట్టణ ప్రగతి ద్వారా రూ.20 లక్షల చొప్పున నిధులను వెచ్చించనున్నారు. కేవలం కబడ్డీ, ఖోఖో, షటిల్ కోర్టులకే పరిమితం కాకుండా అథ్లెటిక్ ట్రాక్, ఫుట్బాల్ కోర్టు, క్రికెట్ ప్రాక్టీస్ కోర్టులను మహిళలకు, పురుషులకు వేర్వేరుగా ఏర్పాటు చేయనున్నారు.
జిల్లా కేంద్రంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో రూ.1.40 కోట్లతో అధునాతన క్రీడా మైదానాలు ఏర్పాటు చేయడానికి కమిషనర్ నిర్ణయించారు. ప్రగతి మైదానం, సాధన గ్రౌండ్, రామచంద్రా డిగ్రీ కాలేజీ, రామవరం, కొత్తగూడెం కూలీలైన్లలో మైదానాలను ఏర్పాటు చేయనున్నారు. ఇల్లెందు, పాల్వంచ, మణుగూరు ప్రాంతాల్లో కూడా అతిపెద్ద ఆటస్థలాలను ఏర్పాటు చేయనున్నారు.
పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా ప్రతి పల్లెకూ ఆటస్థలం ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే అన్ని మండలాల్లో స్థలాలు సేకరించాం. జూన్ 2కి క్రీడా మైదానాలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రత్యేక అధికారులు అన్ని మండలాలకూ వెళ్లి స్థలాలను పరిశీలించారు. రెవెన్యూ శాఖ అధికారులు ఎంపీడీవోలకు స్థలాలను అప్పగించారు. మున్సిపాలిటిల్లోని క్రీడాస్థలాలను మరింత మెరుగుపరుస్తాం.
-దురిశెట్టి అనుదీప్, భద్రాద్రి కలెక్టర్