ఖమ్మం వ్యవసాయం, జూన్ 13 : ఖమ్మం డీసీసీబీ పాలకవర్గ సమావేశం గురువారం మరోసారీ వాయిదాకే పరిమితమైంది. బహిరంగ దూషణలతో మూడోసారి కూడా వాయిదా పడింది. రోజులు మారినా, నెలలు గడిచినా పాలకవర్గ సభ్యుల వైఖరిలో పిసరంతైనా మార్పు లేదు. కాలం నెత్తిమీదకొచ్చి కర్షకులు కష్టాల్లో ఉన్నా వారిపై కనీస కనికరం చూపడం లేదు.
ఖాతాదారులు కొట్టుమిట్టాడుతున్నా పట్టింపులేదు. కయ్యాలకు కాలు దువ్వుకుతున్నారే తప్ప కర్షకులు, ఖాతాదారుల సమస్యలను పట్టించుకోవడం లేదు. అదును పోకముందే అన్నదాతకు ఆపన్నహస్తం అందిస్తామని, తమ సమస్యలేమైనా ఉంటే తరువాత చర్చించుకుంటామని అనుకున్న పాపానపోలేదు. అసలు వారి పంతాలు, సొంత అజెండాలు తప్ప హలధారుల సమస్యల గురించి చర్చించే ఓపిక, పరిష్కరించే తీరిక వారికి ఏమాత్రమూ లేనట్లుగా కన్పిస్తోంది.
డీసీసీబీ పాలకవర్గ బాధ్యుల్లోని విభేదాలు ముదిరిపాకాన పడుతున్నాయి. ఏకంగా బ్యాంకు ప్రధాన కార్యాలయంలోనే, అందులోనూ సాక్షాత్తూ ఉద్యోగుల సమక్షంలోనే బహిరంగ దూషణలు, వాగ్వాదాలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. చివరికి విశ్రాంతి భవనం తలుపులు పగులగొట్టే స్థాయికి చేరింది. గడిచిన మూడు నెలలుగా ఖమ్మం డీసీసీబీ పాలకవర్గ సభ్యులు రెండు గ్రూపులుగా విడిపోయారు. ఖాళీగా ఉన్న డైరెక్టర్ల స్థానాలను భర్తీ చేయాలని, ఇన్చార్జి చైర్మన్ స్థానంలో పూర్తిస్థాయి చైర్మన్‌ను ఎన్నుకోవాలని మెజార్టీ డైరెక్టర్లు పట్టుబడుతున్నారు. అందులో భాగంగానే మార్చి 15న ఏర్పాటైన పాలకవర్గ సమావేశంలో సభ్యులు నాలుగు ప్రధాన డిమాండ్లను చైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు.
వారి అభ్యర్థన చైర్మన్ పరిగణనలోకి తీసుకోకపోవడంతో ఆ సమావేశం వాయిదాపడింది. ప్రస్తుత ఇన్చార్జి చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఈ నెల 6న రెండోసారి పాలకవర్గ సమావేశం ఏర్పాటైంది. ఈ సమావేశంలోనూ ఖాళీ స్థానాలకు ఎన్నికలతోపాటు బ్యాంకు ఉద్యోగుల బదిలీలు, ఉద్యోగుల బోనస్ వివరాలు తదితర అంశాలను అజెండాలో చేర్చాలని డీసీసీబీ డైరెక్టర్లు తుళ్లూరి బ్రహ్మయ్య, బొర్రా రాజశేఖర్, మేకల మల్లిబాబుయాదవ్, జనగం కోటేశ్వరరావు సహా మొత్తం 10 మంది డైరెక్టర్లు పట్టుబట్టారు. అక్కడ కూడా ఆ డైరెక్టర్లకు భంగపాటు ఎదురుకావడంతో ఆ సమావేశం కూడా వాయిదా పడింది.
ఇన్నాళ్లూ సమావేశ మందిరానికే పరిమితమైన డీసీసీబీ డైరెక్టర్ల కోల్డ్‌వార్ ఇటీవల మొత్తానికే బయటపడింది. తాజాగా గురువారం ఉద్యోగులు, అధికారుల సాక్షిగా రచ్చకెక్కింది. మూడోసారిగా గురువారం జరిగిన పాలకవర్గ సమావేశానికి తుళ్లూరి బ్రహ్మయ్యతోపాటు మరో పదిమంది డైరెక్టర్లు బ్యాంకు కార్యాలయానికి చేరుకున్నారు. విశ్రాంతి భవనంలో కూర్చువాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్లగా.. దానికి తాళం వేసి ఉంది. అయితే దాని మూడు తాళం చెవులూ చైర్మన్ వద్దనే ఉన్నాయనే విషయం తెలుసుకున్న డైరెక్టర్లు.. ఆగ్రహంతో విశ్రాంతి భవనం తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లారు. కొద్దిసేపటికే అక్కడికి చేరుకున్న ప్రస్తుత చైర్మన్ దొండపాటి.. సభ్యుల తీరుపై మండిపడ్డారు. ఈ క్రమంలో అటు డైరెక్టర్లు, ఇటు చైర్మన్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
అక్కడే ఉన్న బ్యాంకు ఉన్నతాధికారులు, అధికారులు ఈ పరిస్థితిని గమనించి మెల్లగా తమ తమ చాంబర్లకు వెళ్లిపోయారు. తరువాత కొద్దిసేపటిలోనే బోర్డ్ రూములో పాలకవర్గ సమావేశాన్ని చైర్మన్ ప్రారంభించారు. విషయం తెలుసుకున్న డైరెక్టర్లు తిరిగి అక్కడికి చేరుకొని తాము హాజరైనట్లు సంతకాలు చేశారు. కా.. తమ డిమాండ్లు అజెండాలో లేకపోవడంతో సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఇన్చార్జి చైర్మన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని డైరక్టర్ జనగం కోటేశ్వరరావు మీడియాకు వివరించారు. మెజార్టీ సభ్యుల వాదన వినిపించుకోవడం లేదని ఆరోపించారు. తమ డిమాండ్లను అజెండాలో పెట్టేవరకు సమావేశంలో పాల్గొనబోమని స్పష్టం చేశారు.
ఖాళీగా ఉన్న చైర్మన్ స్థానానికి, డైరెక్టర్ల స్థానాలకు ఎన్నిక నిర్వహించే విషయాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిల దృష్టికి తీసుకెళ్తా. వారి సూచన మేరకు తప్పకుండా వచ్చే సమావేశంలో అవసరమైన విషయాలను అజెండాలో పెడతాం. పాలకవర్గంలోని కొందరు సభ్యులు కొద్ది రోజులుగా ఉద్దేశపూర్వకంగా రచ్చ చేసున్నట్లు కన్పిస్తోంది. వారి అభిప్రాయాన్ని గౌరవించి మూడు నెలల క్రితమే నూతన డైరెక్టర్ల ఎన్నిక అంశాన్ని అజెండాలో పెట్టాం. అయితే వారు పేర్లు చెప్పలేక చైర్మన్ ఎన్నికను తెరపైకి తీసుకొచ్చారు. ఈరోజు కూడా నాలుగు అంశాలను నా దృష్టికి తీసుకొచ్చారు. వచ్చే సమావేశంలో వాటిని అజెండాలో పెడతామని సభ్యులకు తెలియజేశాం.
-దొండపాటి వెంకటేశ్వరరావు, డీసీసీబీ ఇన్చార్జి చైర్మన్