మామిళ్లగూడెం, జూన్ 21: జిల్లాలో గంజాయి రవాణా కట్టడికి పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని సీపీ సునీల్‌దత్ ఆదేశించారు. ‘మాదకద్రవ్యాలు, గంజాయి సరఫరా, చట్టవ్యతిరేక కార్యకలాపాలు అడ్డుకొనేందుకు తీసుకోవాల్సిన చర్యలు, పెండింగ్ గంజాయి కేసుల సమీక్ష’పై జిల్లాలోని పోలీసు అధికారులతో ఖమ్మం నుంచి శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. సరిహద్దు చెక్‌పోస్టుల్లో వాహనాల విస్తృత తనిఖీల ద్వారా గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేయగలమన్నారు. రైలు మార్గాలతోపాటు రోడ్డు రవాణా సదుపాయాలు ఉన్న సరిహద్దు రాష్ట్రాల నుంచి జిల్లా మీదుగా ఇతర రాష్ట్రాలకు గంజాయిని తరలించే అవకాశం ఉందన్నారు.
అందుకని ఈ అక్రమ రవాణాపై స్థానిక పోలీసులతోపాటు టాస్‌ఫోర్స్ పోలీసులు కూడా దృష్టి సారించాలని సూచించారు. సరఫరా మూలాలను కనిపెట్టి వ్యాపారులపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని ఆదేశించారు. వినియోగదారుల నుంచి విక్రయదారుల వరకు సరఫరా లింకులపై డేగ కన్ను వేసి ఉంచాలన్నారు. ఉపాధి కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు, విద్యార్థులు, యువకులను కొందరు గంజాయి స్మగ్లర్లు ఆసరాగా చేసుకున్నారని అన్నారు. వారికి గంజాయిని అందజేసేందుకు పాన్ డబ్బాలను అడ్డాలుగా మార్చుకుంటున్నారని అన్నారు. అందుకని ఆయా అడ్డాలపై నిఘా పెట్టాలని ఆదేశించారు.
గంజాయి మత్తుకు అలవాటైన యువకులు, కార్మికులు.. తమ స్నేహితులతో కలిసి పట్టణాల శివారు ప్రాంతాల్లో దమ్ము కొడుతున్నారని అన్నారు. అందుకని శివార్లలో నిఘా పెంచి గంజాయి దమ్ముకొడుతున్న వారిని అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు. అలాగే, కళాశాలల్లోకి ఈ విష సంస్కృతి విస్తరిస్తే ఒక విద్యార్థిని చూసి మరొక విద్యార్థి గంజాయికి అలవాటుపడే ప్రమాదముంటుందని అన్నారు. కాబట్టి క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ వినియోగం వల్ల జరిగే దుష్పరిణామాల గురించి సూళ్లు, కాలేజీలు, పబ్లిక్ ప్రదేశాల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఎస్బీ ఏసీపీ ప్రసన్నకుమార్, సీఐలు స్వామి, రామకృష్ణ పాల్గొన్నారు.
యోగాతో శారీరక, మానసిక, ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని యోగా గురువు వీ.సురేశ్ పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఖమ్మంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో అభ్యాసన కార్యక్రమంలో పోలీసు సిబ్బంది యోగాసనాలు సాధన చేశారు. ఈ సందర్భంగా యోగా గురువు మాట్లాడుతూ.. యోగా అనేది భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక అభ్యాసమని వివరించారు. ఆర్ఐలు కామరాజు, శ్రీశైలం, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.