ఖమ్మం, ఫిబ్రవరి 28 : ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు 2023- 24 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.221.72 కోట్లతో బడ్జెట్ రూపొందించగా సభ్యులు ఆమోదించారు. మంగళవారం కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో నగర మేయర్ పునుకొల్లు నీరజ అధ్యక్షతన కౌన్సిల్ ప్రత్యేక సమావేశం నిర్వహించి బడ్జెట్ ఆమోదించారు. ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, కలెక్టర్ వీపీ గౌతమ్, కమిషనర్ ఆదర్శ సురభి హాజరయ్యారు. మున్సిపల్ కార్పొరేషన్ ఏకౌంట్ అధికారి శివలింగం బడ్జెట్ పద్దును చదవగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. కార్పొరేషన్ బడ్జెట్లో సొంత ఆదాయం రూ.80.66 కోట్లుగా చూపారు. అందులో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల పన్నుల ద్వారా రూ.30.78 కోట్లు, కిరాయిల ద్వారా రూ.4.82 కోట్లు, భవన నిర్మాణ అనుమతులు, ఎల్ఆర్ఎస్, ఇతర టౌనింగ్ పనుల సేవల ద్వారా రూ.29.42 కోట్లు, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు, ఇతర శానిటేషన్ ఫీజుల ద్వారా రూ.2.06 కోట్లు, తాగునీటి పన్నులు, ఇతర ఇంజినీరింగ్ సేవల ద్వారా రూ.11.93 కోట్లు సొంత ఆదాయంగా వస్తాయని బడ్జెట్లో చూపారు. వేతనాలు, పీఎప్, ఈపీఎప్, కార్యాలయ నిర్వహణ, గ్రీన్ బడ్జెట్, విద్యుత్ చార్జిల రూపేణ, రూ.80.66 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేశారు.
నాన్ ప్లాన్ గ్రాంట్ల కింద 15 ఆర్ధిక సంఘం పట్టణ ప్రగతి, అమృత్ పథకం, లేఅవుట్ క్రమబద్దీకరణ, ప్రత్యేక అబివృద్ధి నిధులు, ముఖ్యమంత్రి వాగ్దాన నిధుల ద్వారా రూ.133.82 కోట్లు, ప్లాన్ గ్రాంట్‌లో ఎస్ఎఫ్సీ, కార్పొరేషన్ అభివృద్ధి, స్వచ్ఛభారత్, స్వచ్ఛ తెలంగాణ ద్వారా రూ.80 లక్షలు వస్తాయని అంచనా వేశారు. నియోజకవర్గ అభివృద్ధి నిధులు, స్పెషల్ డవలప్మెంట్ నిధులు, ఎంపీ ల్యాండ్ నిధులు, ఇతర రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్లు ద్వారా రూ.92 లక్షలు వస్తాయని చూపారు. మొత్తం బడ్జెట్లో జీతాలు, కరెంట్ బిల్లులు, పాలన నిర్వహణ ఖర్చులు పోయిన తర్వాత మిగిలిన బడ్జెట్లో 1/3శాతం విలీన గ్రామాల అభివృద్ధికి రూ.5.87 కోట్లు కేటాయించారు. అవుట్ సోర్సింగ్ సిబ్బంది వేతనాలకు రూ.28.38 కోట్లు, ప్రజారోగ్యం, పారిశుధ్య నిర్వహణకు రూ.8.21 కోట్లు విద్యుత్ చార్జిలను రూ.6.41 కోట్లు రుణాల చెల్లింపునకు రూ. 1.26 కోట్లు గ్రీన్ బడ్జెట్ కోసం రూ.8.1 లక్ష, వివిధ డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాల కోసం వార్డు బడ్జెట్ కింద రూ.11.73 కోట్లు, ఇంజినీరింగ్ విభాగ వ్యయం కింద రూ.4.91 కోట్లు, సాధారణ పరిపాలన వ్యయం కింద రూ.5.3 కోట్లు, పట్టణ ప్రణాళిక విభాగ వ్యయం కింద రూ.1.8 కోట్లు, ప్రజా సౌకర్యాలకు రూ.30 లక్షలుగా చూపించారు. సొంత ఆదాయంలో ఖర్చులు పోనూ మిగిలిన రూ.92 లక్షలు మిగులు బడ్జెట్‌గా చూపారు. వీటితో డివిజన్లల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. సమావేశంలో కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణకే ఖమ్మం రోల్‌మోడల్
ఖమ్మం కార్పొరేషన్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా సవివరంగా బడ్జెట్ రూపకల్పన చేశారని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. గతంలో ఆదాయం, భవిష్యత్ ఆదాయం బడ్జెట్లో వివరించారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఖమ్మం కార్పొరేషన్‌గా అవతరించకా ఖమ్మం అభివృద్ధిలో తెలంగాణలోనే రోల్‌మోడల్‌గా నిలిచిందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల సమష్టి కృషితో ఈ అభివృద్ధి జరిగిందన్నారు. ఖమ్మాన్ని సొంత ఇంటిలా భావించాలని ఆయన తెలిపారు. ఒకప్పడు మురికి కూపంగా ఉన్న ఖమ్మం త్రీటౌన్ ప్రాంతం ఇప్పుడు గోళ్లపాడు ఆధునీకరణ పనులతో సుందరంగా తయారయ్యిందన్నారు.
-ఎమ్మెల్సీ తాతా మధుసూదన్
లే అవుట్ అనుమతులతో పెరిగిన ఆదాయం
వచ్చే ఆర్థిక సంవత్సరం రాబడి ఖర్చుల గురించి వివరంగా బడ్జెట్లో తెలిపారని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. రీ అసిస్మెంట్ చేయని ఆస్తులు, భవన యాప్ ద్వారా అసిస్ చేయాలన్నారు. ట్రేడ్ లైసెన్స్‌ల విషయంలో చర్యలు తీసుకోవాలని తెలిపారు. లేఅవుట్ అనుమతులతో ఆదాయం పెరిగిందన్నారు. రహదారుల అక్రమణ చేస్తున్న వీధి వ్యాపారులను స్రీట్ వెండర్ జోన్లకు తరలించాలన్నారు.
– కలెక్టర్ వీపీ గౌతమ్