ఖమ్మం, మార్చి 25 : జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లకు పటిష్ట కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్ల సన్నాహక సమావేశం నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో మంగళవారం అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్‌రెడ్డితో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఖరీఫ్ ధాన్యం సేకరణ జిల్లాలో విజయవంతంగా జరగడం పట్ల అన్ని శాఖల అధికారులను అభినందించారు. రైతులు పండించిన వరి పంట విస్తీర్ణం, కోతల సమయం, కొనుగోలు కేంద్రాలకు ఎప్పుడు పంట తీసుకొస్తారనే అంశంపై వ్యవసాయ శాఖ ప్రణాళికాబద్ధంగా షెడ్యూల్ రూపొందించాలన్నారు.
సన్న, దొడ్డు రకం ధాన్యం కొనుగోళ్లను వేర్వేరు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో వేయింగ్ మిషన్లు, తేమ యంత్రాలు, ప్యాడీ క్లీనర్, టార్పాలిన్, గన్ని సంచులు తదితర మౌలిక వసతులు ఉండేలా చూసుకోవాలన్నారు. వేసవి దృష్ట్యా తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని, చల్లని నీరు ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాలని, అవసరమైన మేర ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. రైతులకు ధాన్యం డబ్బులు 48 గంటల వ్యవధిలో జమ అయ్యేలా చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లుల వద్ద హమాలీల కొరత రాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ధాన్యం, మొకజొన్న కొనుగోలు ఒకేసారి జరుగుతున్న నేపథ్యంలో రవాణా ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైస్ మిల్లులకు తరలించేలా పటిష్ట వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం కనీస మద్దతు ధర తెలిపే కరపత్రాన్ని కలెక్టర్ ఆవిషరించారు. సమావేశంలో డీఆర్డీవో సన్యాసయ్య, జిల్లా వ్యవసాయాధికారి డి.పుల్లయ్య, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ జి.శ్రీలత, జిల్లా మారెటింగ్ అధికారి ఎంఏ.అలీం, జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్‌కుమార్, డీసీవో గంగాధర్ పాల్గొన్నారు.