మామిళ్లగూడెం, సెప్టెంబర్ 12: జిల్లాలో వరద బాధితుల సహాయార్థం చేపట్టిన ‘నా ఖమ్మం కోసం నేను..’ అనే కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించిందని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ తెలిపారు. ప్రజల నుంచి చేపడుతున్న విరాళాలు, ఉపయోగ వస్తువుల సేకరణకు మంచి స్పందన వస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
వరద బాధితుల సహాయం అందించేందుకు వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా జిల్లాలోని గణేశ్ మండపాల వద్ద ‘నా ఖమ్మం కోసం నేను..’ పేరిట హుండీలను ఏర్పాటుచేసినట్లు చెప్పారు. వీటికి మంచి స్పందన లభిస్తోందన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు రూ.11.20 లక్షలు సమకూరినట్లు వివరించారు. వీటితోపాటు 7,419 కిలోల బియ్యం, 1,230 జతల దుస్తులు, 9 బ్లాంకెట్లు, 75 నోట్ పుస్తకాలు, రెండు జతల చెప్పులు, రెండు ఇతర వస్తువులు సమకూరినట్లు వివరించారు.