మామిళ్లగూడెం, మే 27 : పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్ సోమవారం పూర్తయిన తర్వాత బ్యాలెట్ బాక్స్‌లకు పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో సీల్ వేసి.. పోలీస్ భద్రత నడుమ నల్లగొండలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూంకు తరలించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. పోలింగ్ పూర్తయిన తర్వాత పోలింగ్ కేంద్రాల నుంచి సీల్ వేసిన బ్యాలెట్ బాక్స్‌లు, ఎన్నికల ఫారాలు పోలీస్ ఎసార్ట్, సెక్టార్ అధికారుల పర్యవేక్షణతో ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కేంద్రానికి చేరాయన్నారు.
ఇక్కడి అధికారులు, సిబ్బంది వాటిని సరిచూసుకొని మళ్లీ పోలీస్ ఎసార్ట్ భద్రత నడుమ ఆర్టీసీ డీజీటీ బస్సులలో నల్గొండలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూంకు తరలించామని చెప్పారు. జూన్ 5న నల్గొండలో కౌంటింగ్ ప్రక్రియ ఉంటుందని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి.మధుసూదన్‌నాయక్, డీఆర్వో ఎం.రాజేశ్వరి, ఆర్డీవోలు గణేశ్, రాజేందర్, డీఎం సివిల్ సప్లయిస్ శ్రీలత, అధికారులు పాల్గొన్నారు.