కూసుమంచి, ఏప్రిల్ 28: తమ తమ సమస్యలపై ప్రజలు చేసుకున్న అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, వాటిని త్వరితగతిన పరిష్కరించే అంశంపై దృష్టి సారించాలని కలెక్టర్ దివాకర రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. అలాగే ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశించారు. కూసుమంచి తహసీల్దార్ కార్యాలయాన్ని మంగళవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాష్ట్రంలోనే మొదటి భూ భారతి, భూ మ్యాప్ ఆధారిత రిజిస్ట్రేషన్ చేసినందుకు తహసీల్దార్ సైదయ్యను అభినందించారు. అనంతరం భూ భారతి ఫైళ్లను పరిశీలించారు.
ప్రజల సమస్యలు తీర్చడంతో అధికారులు ముందుండాలని, అందుకనుగుణంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని ఆదేశించారు. అనంతరం మండలంలో ధాన్యం, మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాలు. వాటి పనితీరును పరిశీలించారు. పంట ఉత్పత్తుల కొనుగోళ్లలో రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని ఆదేశించారు. బుధవారం పాలేరులో జరగబోయే ప్రజా దర్బార్ విషయంలో తీసుకోనున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజా దర్బార్లో ప్రజల అపరిష్కృత సమస్యలు సత్వరమే పరిష్కారమయ్యే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్ఐలు రాము, జ్యోతి, సర్వేయర్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.