ఖమ్మం, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అన్ని పార్టీల నాయకులు సహకరించాలని, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను కలెక్టరేట్లో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఐదు దశల్లో నిర్వహించే ఎన్నికల ప్రక్రియ ఈ నెల 9న ప్రారంభమై నవంబర్ 11న ముగుస్తుందని తెలిపారు.
రెండు విడతల్లో జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఈ నెల 9న, మూడు విడతల్లో జరిగే సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు 17న నోటిఫికేషన్ విడుదల చేస్తామని వివరించారు. ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులు, సిబ్బంది వివరాలతోపాటు రిజర్వేషన్ల వివరాలు వెల్లడించారు. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల పోలింగ్ పూర్తయిన తర్వాత అదేరోజు ఓట్ల లెక్కింపు పూర్తి చేస్తామని తెలిపారు. జిల్లాలో ఎన్నికల నేపథ్యంలో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందన్నారు.
ఎన్నికల షెడ్యూల్ ఇలా..
జిల్లాలో మొత్తం 8,02,690 మంది ఓటర్లు ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. 20 జడ్పీటీసీలు, 283 ఎంపీటీసీ స్థానాలు ఉన్నట్లు చెప్పారు. వీటికోసం 1,580 పోలింగ్ స్టేషన్లు, 593 పోలింగ్ లొకేషన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే 571 గ్రామ పంచాయతీలు, 5,214 వార్డులు ఉన్నాయన్నారు. ఎన్నికల కోసం 5,746 బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేసినట్లు తెలిపారు.
అధికారుల నియమాకం
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం 40 మంది జోనల్ అధికారులను నియమించినట్లు తెలిపారు. 20 మంది ఫ్లయింగ్ స్కాడ్లు, మరో 16 ఎస్ఎస్టీ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీరితోపాటు వీడియోగ్రాఫర్స్, పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఇలా..
మొదటి విడతలో 149 ఎంపీటీసీ స్థానాలు, 10 జడ్పీటీసీ స్థానాలకు, రెండో విడతలో 134 ఎంపీటీసీ స్థానాలు, పది జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అదనపు కలెక్టర్ శ్రీజ, జడ్పీ సీఈవో దీక్షా రైనా, డీపీవో ఆశాలత తదితరులు పాల్గొన్నారు.