ఖమ్మం వ్యవసాయం, జూన్ 7 : వరుస సెలవుల అనంతరం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం నుంచి క్రయవిక్రయాలు ప్రారంభమయ్యాయి. గత నెల 10వ తేదీ నుంచి పార్లమెంట్ఎన్నికలు, తర్వాత వేసవి సెలవులు రావడంతో మార్కెట్లో క్రయవిక్రయాలు చేపట్టలేదు. శుక్రవారం ఉదయం నుంచి క్రయవిక్రయాలు చేపట్టడంతో జెండా పాటలో మిర్చి క్వింటా ధర రూ.16,200 పలుకగా.. కనిష్ట ధర రూ.10 వేలు పలికింది. ఏసీ రకం క్వింటా గరిష్ట ధర రూ.20 వేలు పలుకగా..
కనిష్ట ధర రూ.10 వేల చొప్పున ఖరీదుదారులు కొనుగోలు చేశారు. ఇక పత్తి పంట ఆన్లైన్ బిడ్డింగ్‌లో క్వింటా ధర రూ.7,050 పలికింది. పెసర పంట క్వింటా ధర రూ.7 వేలు పలికింది. అయితే తొలిరోజు అపరాలు, పత్తి, మిర్చి పంటను ఆశించిన మేర రైతులు మార్కెట్‌కు తీసుకురాలేదు. శని, ఆదివారం మార్కెట్‌కు సెలవులు కావడంతో సోమవారం నుంచి మార్కెట్లో క్రయవిక్రయాలు చేపట్టనున్నారు. తొలిరోజు క్రయవిక్రయాలను మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ పర్యవేక్షించారు.