అశ్వారావుపేట రూరల్, మార్చి 30: కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని, రాష్ట్రంలో ప్రజలు బతుకులు మారాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని వినాయకపురం గ్రామంలో చిలకలగండి ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో ఆదివారం బీఆర్ఎస్ నాయకులు మోకాళ్లపై ప్రదక్షిణ చేశారు.
భక్తుల కోర్కెలు తీర్చే ఇలవేల్పు, గ్రామదేవతగా పేరుపొందిన ముత్యాలమ్మ తల్లి ఆలయం వద్ద ఉగాది పర్వదినం సందర్భంగా యువజన నేత మోటూరి మోహన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ర్టాన్ని మళ్లీ కేసీఆర్ పరిపాలించాలని, ఎమ్మెల్యేగా మెచ్చా నాగేశ్వరరావు గెలవాలని, విశ్వావసు నామ సంవత్సరంలో కేసీఆర్ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో గడపాలని అమ్మవారిని మొక్కుకున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసిందని, ఇప్పుడు ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. అవినీతి కాంగ్రెస్ పాలన తమకొద్దని ప్రజలు ఈసడించుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మోటూరి మోహన్‌తోపాటు కునసోతు నవీన్, రాంజీ, రాము పాల్గొన్నారు.