ఖమ్మం, ఏప్రిల్ 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్ దండు కట్టింది.. కేంద్రంపై యుద్ధం ప్రకటించింది.. మూకుమ్మడిగా ఢిల్లీకి చేరుకున్నది.. సోమవారం సీఎం కేసీఆర్ చేపట్టిన దీక్షలో పాల్గొని గళమెత్తింది.. బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టింది.. కేంద్రం ధాన్యం కొనే వరకూ పోరాడతామని హెచ్చరించింది.. దీక్షకు ఉమ్మడి జిల్లా నుంచి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఉభయ జిల్లాల పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు, తాతా మధు, శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య, వనమా వెంకటేశ్వరరావు, కందాళ ఉపేందర్‌రెడ్డి, రాములునాయక్, మెచ్చా నాగేశ్వరరావు, హరిప్రియానాయక్, ఉభయ జిల్లాల జడ్పీ చైర్మన్లు లింగాల కమల్‌రాజు, కోరం కనకయ్య తదితరులు హాజరయ్యారు.
యాసంగిలో తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ఢిల్లీలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఉభయ జిల్లాల పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు, తాతా మధు, శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య, వనమా వెంకటేశ్వరరావు, కందాళ ఉపేందర్‌రెడ్డి, రాములునాయక్, మెచ్చా నాగేశ్వరరావు, హరిప్రియానాయక్, ఉభయ జిల్లాల జిల్లాపరిషత్ చైర్మన్లు లింగాల కమల్‌రాజు, కోరం కనకయ్య, పార్టీ భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జి తెల్లం వెంకట్రావు, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, నగర మేయర్ పునుకొల్లు నీరజ, ఖమ్మం ఏఎంసీ చైర్మన్ లక్ష్మీప్రసన్న, రెండు జిల్లాల గ్రంథాలయ సంస్థ చైర్మన్లు కొత్తూరు ఉమామహేశ్వరరావు, దిండిగాల రాజేందర్, సత్తుపల్లి, వైరా, ఇల్లెందు మున్సిపల్ చైర్మన్లు కూసంపూడి మహేశ్, సూతకాని జయపాల్, దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉదయం ప్రారంభమైన దీక్ష సాయంత్రం వరకు కొనసాగింది. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య నల్ల చొక్కా ధరించి వరి కంకులతో చేసిన గొడుగుతో దీక్షకు హాజరయ్యారు.
తెలంగాణ రైతుల పోరాటం ప్రశంసనీయం
రైతుల పండించిన ఒడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ నాయకులు, రైతులు చేస్తున్న ఉద్యమాలు ప్రశంసనీయం. తెలంగాణ రాష్ట్ర రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నట్లు స్పష్టమవుతోంది. రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం రైతుల హక్కులను కాలరాయడం అన్యాయం. తెలంగాణ రైతులకు న్యాయం జరిగే వరకు తిరిగి చూడకుండా పోరాటాలు చేయాల్సిందే. అందుకు తెలంగాణ ప్రజల మద్దతు ఉంటుంది.
–పల్లా వెంకటరెడ్డి, రైతు, కాకరవాయి
ఉద్యమాన్ని ఉధృతం చేయాలి
తెలంగాణలో రైతులు యాసంగిలో పండించే ధాన్యం మొత్తం కేంద్రం కొనుగోలు చేసే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేయాలి. అన్ని పార్టీల నాయకులను, రైతు సంఘాలను కలుపుకొని కేంద్రంపై పోరాడాలి. ప్రధాని మోదీ మెడలు వంచే వరకు తెలంగాణ సత్తా చూపాలి. తెలంగాణ రైతుల పక్షాన సీఎం కేసీఆర్ ఢిల్లీలో పోరాడడం నిజంగా స్వాగతించాల్సిన అంశం. రైతులను ఆదుకోవడంలో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. సీఎం కేసీఆర్ రైతుల ప్రయోజనాలను కాపాడి వారికి మద్దతు ధరను ప్రకటించారు. పండించిన మొత్తం ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలి.
–బొంతు రాంబాబు, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి
ఢిల్లీ కోటలో తెలంగాణ సత్తా చాటారు..
దేశ రాజధానిలో సీఎం కేసీఆర్ తెలంగాణ రైతుల పక్షాన పోరాడడం స్వాగతించదగిన పరిణామం. రాజకీయ కోణం ఎలా ఉన్నప్పటికీ తెలంగాణ రైతులు పడుతున్న ఇబ్బందులను దేశానికి తెలిసేలా ధర్నా చేయడం మంచి విషయం. అయితే దక్షిణాది రాష్ర్టాల పట్ల మోదీ ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. ధాన్యం కొనుగోలు చేయకపోవడమే అందుకు మంచి ఉదాహరణ. పంజాబ్‌లో రెండు పంటల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న కేంద్రం.. తెలంగాణలో ఎందుకు కొనదో చెప్పాలి.
–కొండపర్తి గోవిందరావు, తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి
తెలంగాణ ధాన్యాన్ని కొనాల్సిందే..
– ఎంపీ నామా నాగేశ్వరరావు
ఖమ్మం, ఏప్రిల్ 11: ఎండనక, వాననక కష్టపడి పండించిన తెలంగాణ రైతుల ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనాల్సిందేనని టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కేంద్రంపై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఢిల్లీలో సోమవారం చేపట్టిన దీక్షలో ఎంపీ నామా మాట్లాడారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించకపోతే రైతు ఉద్యమంతో భూకంపం సృష్టిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర నాయకులు వద్దిరాజు రవిచంద్ర (గాయత్రీ రవి), టీఆర్ఎస్ నాయకురాలు మద్దినేని బేబీ స్వర్ణకుమారి, కనకమేడల సత్యనారాయణ, బాణాల వెంకటేశ్వర్లు, చిత్తారు సింహాద్రి, హరికృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నిరసన దీక్ష.. దేశవ్యాప్త చర్చకు దారితీసింది
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఢిల్లీలో చేపట్టిన నిరసన దీక్ష యావత్ దేశవ్యాప్త చర్చకు దారితీసింది. ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా 2వేల కిలోమీటర్ల నుంచి ఢిల్లీకి వచ్చి రాష్ట్ర సర్కారు దీక్ష చేయడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. రాకేశ్ టికాయత్ వంటి రైతు సంఘం నాయకులు సైతం దీక్షకు సంపూర్ణ మద్దతు పలికారు. సీఎం కేసీఆర్ ఆలోచనతో దేశ రైతులు, నాయకులు ఏకీభవించారు. దేశ వ్యాప్తంగా పంటల కొనుగోలు విధానం ఒకేలా ఉండాలని మేధావులు సైతం అంగీకరించారు. ఇప్పటికైనా కేంద్ర సర్కారు దిగిరావాలి. లేకుంటే దేశవ్యాప్తగా మరోసారి రైతుల నుంచి తీవ్ర నిరసన ఎదుర్కోవాల్సి ఉంటుంది.
–నల్లమల వెంకటేశ్వరరావు, రైతుబంధు సమితి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు
కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయాల్సిందే..
కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు చేయాలి. దేశంలో ఒక్కొక్క రాష్ర్టానికి ఒక్కొక్క విధానాన్ని పాటించడం సరికాదు. ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం దేశమంతటా ఒకే విధానాన్ని అమలుచేయాలి. పంజాబ్ రాష్ట్రంలో కొనుగోలు చేసిన విధంగా తెలంగాణ రైతుల ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలి. తెలంగాణ బీజేపీ నేతలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులకు న్యాయం చేయాలి.
– గోకినపల్లి వెంకన్న, పిండిప్రోలు