జై కేసీఆర్.. జైజై కేసీఆర్.. అంటూ వాడలన్నీ దద్దరిల్లాయి. పల్లె, పట్టణం తేడాలేకుండా జన హృదయనే తకు జనం జేజేలు పలికారు. జాతిపిత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పుట్టినరోజు వేడుకలు మంగళవారం ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా అంబరాన్నంటాయి. బర్త్ డే కేక్‌లు కట్ చేసి.. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకొని సంబురాలు చేసుకున్నారు. తమ అభిమాన నాయకుడు కేసీఆర్ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వెయ్యేండ్లు వర్థిల్లాలని ఇష్టదైవాలను వేడుకున్నారు. పలుచోట్ల రక్తదాన శిబిరాలు నిర్వహించారు..
రోగులకు పండ్లు పంపిణీ చేశారు.. మొక్కలు నాటారు.. పేదలకు అన్నదానాలు చేశారు.. ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడుతూ కొట్లాడి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిదిన్నరేండ్లు పాలన చేపట్టిన తమ నాయకుడు కేసీఆర్ అన్నివర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు అహర్నిశలు కృషిచేశారని కొనియాడారు. ప్రధానంగా నిధులు, నీళ్లు, నియామకాలు వంటి అంశాల్లో తనదైన ముద్ర వేశారని తెలిపారు.
శాశ్వత అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం, అనతికాలంలోనే వాటిని పూర్తి చేయడంలో ఆయనకు సాటి మరొకరు లేరన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలోని సాయిబాబా ఆలయంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్టాన్ని పోరాడి సాధించడమేకాకుండా అన్నిరంగాల్లో రాష్ర్టాన్ని అభివృద్ధిలో పయనింపజేశారని కొనియాడారు. రానున్న సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రికావడం ఖాయమని అన్నారు.
– ఖమ్మం, నమస్తే తెలంగాణ ప్రతినిధి/భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, ఫిబ్రవరి17