ఒక ఉద్యమం ప్రపంచాన్ని ఆకర్షించింది.. ఒక వ్యక్తి దీక్ష దేశ ప్రజలను ఆలోచింపజేసింది.. ఓ నాయకుడి ఉపన్యాసం ప్రజలకు స్ఫూర్తినిచ్చింది.. బక్క పలచటి వ్యక్తిపై అచెంచల విశ్వాసం పెట్టుకున్నారు ఆ ప్రాంత ప్రజలు.. ఆరు దశాబ్దాలు దోపిడీకి గురైన ప్రజానీకం ఒక్క గొంతుగా నిలిచింది.. ఆత్మహత్యలు, బలిదానాల సాక్షిగా కొనసాగిన ఉద్యమం.. చావోబతుకో తేల్చుకునేందుకు బరిగీసి నిలిచిన రోజు అది.. ఒకరి దీక్ష నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చింది.. నాయకుని ఆమరణ దీక్ష దేశ ప్రజలను కదిలించింది.. విద్యార్థులు, యువకులు, మేధావులు అందరూ ఒకటై అడుగులో అడుగు వేశారు.. అహింసా మార్గంలో ఉద్యమాన్ని నడిపిన మహానేత, తెలంగాణ ముద్దుబిడ్డ కేసీఆర్ ‘దీక్షా దివస్’ చేపట్టిన రోజు నేడు. ఆ చారిత్రక ఘట్టానికి ఖమ్మం వేదికైంది. అప్పుడు ఉవ్వెత్తున ఎగిసిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్వరూపాన్ని కేసీఆర్ దీక్ష మార్చివేసింది. నాడు ఆమరణ దీక్షకు పూనుకున్న కేసీఆర్‌ను కరీంనగర్లో పోలీసులు అరెస్టు చేశారు. ఉద్యమ ప్రభావం తక్కువగా ఉంటుందనుకొని నేరుగా ఖమ్మం సబ్‌జైలుకు తరలించారు. ఇక్కడే కేసీఆర్ దీక్ష కొనసాగడం, తెలంగాణ ఉద్యమకారులు భగ్గుమనడం, రాష్ట్రం రావణకాష్టం కావడం.. ఫలితంగా ‘తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం’ ప్రకటనకు బీజం పడడం వంటివి ఖమ్మంలో కేసీఆర్ దీక్షకు సమాంతరంగా జరిగిన చర్యలు.. వీటన్నిటినీ నెమరు వేసుకునేందుకే నేడు ఖమ్మంలో దీక్షా దివస్ వేడుకలను బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నారు.
– ఖమ్మం, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)

అది 2009 నవంబర్ 28వ తేదీ. మెదక్ జిల్లా సిద్దిపేట సమీపంలోని రంగదామ్పల్లిలో కేసీఆర్ ఆమరణ దీక్షకు వేదిక సిద్ధమైంది. కరీంనగర్ నుంచి వేదిక వద్దకు దాదాపు 159 వాహనాల భారీ కాన్వాయితో బయల్దేరి వెళ్లిన కేసీఆర్‌ను జిల్లా కేంద్రం పొలిమేరలోని అల్గునూర్ వద్ద వ్యూహాత్మకంగా పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి నుంచి వరంగల్ మీదుగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలనుకున్నారు. చివరికి ఖమ్మంవైపు దారి మళ్లించారు. మధ్యాహ్నం 12:15 గంటలకు ఖమ్మం నగరంలోని చర్చికాంపౌండ్ ఏరియాలో నివాసముండే సెకండ్ క్లాస్ స్పెషల్ మెజిస్ట్రేట్ సీహెచ్ శ్రీరామమూర్తి ఇంటి ముందు కేసీఆర్‌ను తీసుకొస్తున్న కాన్వాయి ఆగింది. అప్పటికే కేసీఆర్‌ను అరెస్టు చేసి తీసుకువస్తున్నట్లు అప్పటి ఏఎస్పీ పరిమళ, ఎస్పీ కాంత్రిరాణా మెజిస్ట్రేట్‌కు సమాచారం అందించారు.
మెజిస్ట్రేట్ ముందు కేసీఆర్‌తోపాటు నాయిని నర్సింహారెడ్డి, విజయ రామారావు, వరంగల్ ఎంపీ రాజయ్యలను హాజరుపరిచారు. కేసీఆర్ సహా 9 మందికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వీరిపై అప్పటికే ఖమ్మం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఐపీసీ 114, 117, 120(బీ), 143, 153(ఏ), 188, 505 (2), 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఆయనకు సలహా ఇచ్చేందుకు కొంతమంది ప్రయత్నించారు. కానీ, కేసీఆర్ అంగీకరించకపోవడంతోపాటు నిరాహార దీక్షను జైలు నుంచే కొనసాగిస్తున్నట్లు ప్రకటించడంతో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.
అదే రోజు 12:45 గంటలకు ఖమ్మం సబ్‌జైలుకు తరలించారు. అప్పటికే తెలంగాణలో నిరసన జ్వాలలు పెల్లుబికాయి. నవంబర్ 29న తెలంగాణ బంద్‌కు టీఆర్ఎస్ పిలుపునిచ్చింది. నవంబర్ 29న న్యాయవాది సుగుణారావు నేతృత్వంలో ఇద్దరు న్యాయవాదులు కేసీఆర్‌ను కలుసుకొని మాట్లాడారు. బయటకు వచ్చి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి వివరించారు. ఆయన పూర్తిగా బలహీనపడ్డట్టు తేల్చారు. సాయంత్రం ఖమ్మం ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ పాపాలాల్ ఆధ్వర్యంలో డాక్టర్ల బృందం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని పరీక్షించి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ధ్రువీకరించారు.

నవంబర్ 30న కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి పరిశీలించిన డాక్టర్లు ఆయనను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసీఆర్ దీక్షను విరమించారని, ఆయన సూచన మేరకే పండ్ల రసం అందించామని ఏఎస్పీ పరిమళ ప్రకటిస్తూ అందుకు సంబంధించిన ఫొటోలను, వీడియో టేప్‌లను పత్రికలకు విడుదల చేశారు. దీంతో తన దీక్ష భగ్నం చేసేందుకు పోలీసులు, పాలకులు డ్రామా చేశారని కేసీఆర్ ఆరోపించారు. తాను దీక్ష కొనసాగిస్తున్నట్లు స్పష్టంగా ప్రకటించారు. దీంతో అగ్గి రాచుకొని నిప్పులకొండై నింగినంటింది. ఉద్యమ స్వరూప స్వభావాన్నే మార్చివేసింది. ఉద్యమాల పురిటిగడ్డ ఖమ్మం వేదికగా విచిత్రమైన మలుపునకు కారణమైన ఆ ఘటన ఇప్పటికీ ఉద్యమ ప్రస్థానంలో ప్రధానంగా నిలిచింది.
తెలంగాణ సాధనే నా లక్ష్యమని ఆస్పత్రి, జైలు ఎక్కడ ఉంచినా దీక్ష మాన్పించడం మీ తరంకాదని ఆనాటి సీమాంధ్ర సర్కార్‌కు కేసీఆర్ అల్టిమేటం ఇచ్చారు. జైల్లో ఉండి కూడా తానే స్వయంగా మానవ హక్కుల చైర్మన్‌కు లేఖ రాశారు. నాకు బెయిల్ వేయకండి అని కేసీఆర్ చెప్పారు. శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని మొట్టమొదటిసారిగా కేసీఆర్‌కు చెప్పింది ఖమ్మం న్యాయవాది మేకల సుగుణారావు. కేసీఆర్ వెంటనే కన్నీళ్ల పర్యంతమయ్యారు. పెద్దగా గుండెలవిసేలా ఏడ్చారు. నేను తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మరెవరూ ప్రాణాలు తీసుకోవద్దని కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం భావితరాల కోసం, విద్యార్థులు, యువకుల జీవితాల్లో వెలుతురు నింపడం కోసమే.. మీలాంటి వారు ఆత్మహత్యలు మానండి, మనోనిబ్బరంతో ఉద్యమంలో భాగస్వాములు కావాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. కేసీఆర్‌ను డిసెంబర్ 2 వరకు ఖమ్మం జైలులో ఉంచి అనంతరం హైదరాబాద్‌కు తరలించారు.
ఖమ్మం, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): దీక్షా దివస్ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో నిర్వహించనున్నట్లు ఎమ్మెల్సీ, ఆ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యమ నేత కేసీఆర్ పదహారేళ్ల కిత్రం చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష.. తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిందని గుర్తుచేశారు. ఉద్యమ చరిత్రలో మైలురాయిగా నిలిచిన ఈ రోజును దీక్షా దివస్‌గా ఘనంగా నిర్వహించుకోవాలని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చినట్లు చెప్పారు. ఈ మేరకు శనివారం ఉదయం 10 గంటలకు పెవిలియన్ గ్రౌండ్ దగ్గర తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద శ్రద్ధాంజలి, 10:30 గంటలకు బైపాస్ రోడ్డులోని తెలంగాణ తల్లి విగ్రహానికి పుష్పాంజలి, 11 గంటలకు తెలంగాణ భవన్లో దీక్షా దివస్ కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. శ్రేణులు తరలిరావాలని పిలుపునిచ్చారు.
మణుగూరు టౌన్, నవంబర్ 28: కొత్తగూడెంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం చేపట్టనున్న దీక్షా దివస్ కార్యక్రమానికి బీఆర్ఎస్ శ్రేణులు తరలిరావాలని ఆ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఉదయం 10 గంటలకు ప్రగతి మైదాన్ వద్ద తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి, 10:30 గంటలకు పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేయనున్నట్లు తెలిపారు. 10:45 గంటలకు దీక్షా దివస్ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. దీనికి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, మెచ్చా నాగేశ్వరరావు, బానోత్ హరిప్రియానాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగాల రాజేందర్ హాజరవుతారని వివరించారు. జిల్లాలో మొదటి విడతలో పంచాయతీ ఎన్నికలు జరిగే మండలాల వారు మినహా రెండు, మూడు విడతల్లో ఎన్నికలు జరిగే వారు తప్పక హాజరుకావాలని కోరారు.
కేసీఆర్‌పైన దేశ ద్రోహం కేసు పెట్టి ఖమ్మం జైలుకు తరలించారు. ఆ కేసులో కేసీఆర్ ఏ1, నేను ఏ2గా ఉన్నాను. నాతోపాటు నాయిని నర్సింహారెడ్డి, కెప్టెన్ లక్ష్మీకాంతారావు, డాక్టర్ విజయరామారావు, కన్నెబోయిన రాజయ్యయాదవ్లు ఉన్నారు. వీరితోపాటు ఖమ్మంకు చెందిన బత్తుల సోమయ్య, గోపగాని శంకర్రావు, అబ్దుల్ నబీ కూడా జైలులో ఉన్నారు. మహత్తర తెలంగాణ ఉద్యమంలో భాగస్వామిగా ఉండటం, కేసీఆర్ లాంటి వ్యక్తితో ఉద్యమంలో నడవడం, ఆయనతోపాటు జైలులో ఉండటం నా జీవితం సార్ధకమైందని అనుకుంటున్నాను.
-డోకుపర్తి సుబ్బారావు, తెలంగాణ ఉద్యమకారుడు
కరీంనగర్లో కేసీఆర్‌ను అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకు తరలిస్తున్నారని తెలిసి ఆ రోజున చాలా ఏడ్చాను. రాజమండ్రిలో కేసీఆర్‌ను చంపుతారని నేను, సుబ్బారావు ఇంకా చాలామంది భయపడ్డాం. కేసీఆర్ లేకపోతే రాష్ట్రం రాదు, టీఆర్ఎస్ ఏమవుతుందోనని ఆందోళన చెందాను. ఆ తరువాత కేసీఆర్‌ను ఖమ్మం తీసుకురావడం, ఇక్కడే జైలుకు తరలించడం, మేము రోడ్డెక్కి ఉద్యమాలు చేశాం.. కేసీఆర్‌తో నడవడం నా అదృష్టం.
– పగడాల నరేందర్, ఉద్యమకారుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు
తెలంగాణ రాష్ట్ర సాధకుడు, ఉద్యమ నేత కేసీఆర్ అంటే నాకు ప్రాణం. ఆయనపై ఉన్న ప్రేమ, అభిమానంతోనే తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలకు ఎదురొడ్డి పోరాడాను. ప్రతి ఉద్యమంలో ముందుండి నడిచాను. కేసీఆర్ ఉన్నడనే ధైర్యం, చేతిలో గులాబీజెండా బలంతో ముందుకెళ్లాం.
– ఉప్పల వెంకటరమణ, ఉద్యమకారుడు
కేసీఆర్‌ను అరెస్ట్ చేసి ఖమ్మం తీసుకొచ్చిన రోజు కోర్టుకు సెలవు ఉంది. ఒక్క మెజిస్ట్రేట్ కూడా లేరు. సెకండ్‌క్లాస్ మెజిస్ట్రేట్ రామచంద్రమూర్తి ఇంటి దగ్గర కేసీఆర్‌ను రిమాండ్ చేశారు. అప్పుడు నేను ఒక్కడినే ‘జై తెలంగాణ’ అని నినాదాలు చేశాను. ఆనాడు ఎస్పీ చాలా నిర్బంధం చేశారు. ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన గొప్ప నేత కేసీఆర్.
– గుండ్లపల్లి శేషగిరిరావు, ఉద్యమకారుడు
కేసీఆర్ అనే మూడు అక్షరాలు ఒక చరిత్ర. ఆ చరిత్రను మరిచిన ఎవరినీ ప్రజలు క్షమించరు. ఏ ఆశయం కోసమైతే కేసీఆర్ తన ప్రాణాలను లెక్కచేయకుండా రాష్ర్టాన్ని సాధించారో అదే రాష్ట్రం నేడు తెలంగాణ ద్రోహుల చేతుల్లో ఉంది. దీనివల్ల ప్రజలు అనేక కష్టాలు పడుతున్నారు. కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రి చేయడం ద్వారా తెలంగాణకు పట్టిన శని వదులుతుంది.
– పువ్వాడ అజయ్‌కుమార్, రాష్ట్ర మాజీ మంత్రి
తెలంగాణను సాధించిన వ్యక్తి, కొత్త రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దిన నాయకుడు కేసీఆర్. అలాంటి వ్యక్తి నాయకత్వంలో పని చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. తెలంగాణ అభివృద్ధిలో నేనూ భాగస్వామికావడం, అందులోనూ ఖమ్మం జిల్లాలో పనిచేయడం నా పూర్వజన్మ సుకృతం. పదిహేనేళ్ల ఉద్యమం ఒక చరిత్ర ఐతే, పదేండ్ల పాలన మరో చరిత్ర.
– తాతా మధుసూదన్, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు
2009 డిసెంబర్ 1 రాత్రి ఖమ్మం ఆస్పత్రిలో కేసీఆర్‌ను కలిశాను. పోలీసులు పెద్దఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ రోజు కేటీఆర్, హరీశ్‌రావును కూడా ఆసుపత్రిలోకి రానివ్వలేదు.. నేను కేసీఆర్‌తోనే ఆసుపత్రిలో ఉన్నాను.. అలా ఉంటానని నా జీవితంలో నేను ఊహించలేదు. నా ఫోన్ నుంచే మానవ హక్కుల చైర్మన్, ఆనాటి సీఎం రోశయ్యతో కేసీఆర్ మాట్లాడారు. జైలులో 2 గంటలకు పైగా ఆయనతోనే ఉన్నా.. ఆ రోజు నుంచి ఉద్యమకారుడిగా పనిచేశాను.
-బిచ్చాల తిరుమలరావు, న్యాయవాద జేఏసీ చైర్మన్
ఖమ్మంలో ఆనాడు ‘జై తెలంగాణ’ అనడానికే చాలామందికి ధైర్యం లేదు. అలాంటి సమయంలో తెలంగాణ పట్ల ఉన్న ప్రేమ, కేసీఆర్ అంటే అభిమానంతో ఉద్యమకారులు, తెలంగాణ పోరాటానికి అన్నివిధాల సహకరించాను. ఆ తరువాత కేసీఆర్ రెండుసార్లు మా ఇంట్లో బస చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. కేసీఆర్ నన్ను కుటుంబ సభ్యుడిగా భావిస్తారు. ఆయనంటే నాకు ప్రాణం.
– ఆర్జేసీ కృష్ణ, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు