పరమ శివుడికి ప్రీతిపాత్రమైన కార్తీక పౌర్ణమి రోజున శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచే భద్రాచలం గోదావరి తీరంలో, అన్నపురెడ్డిపల్లి శివాలయంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. నదీ తీరాన నియమ నిష్ఠలతో పూజలు చేశారు.
అరటి దొప్పలు, తమలపాకులపై ప్రమిదలు పెట్టి దీపాలు వెలిగించారు. నైవేద్యాన్ని సమర్పించి తనివితీరా శివయ్యను కొలిచారు. గోదావరి నదిలో స్నానాలు ఆచరించి భక్తులు చేరుకోవడంతో భద్రాద్రి సీతారామచంద్రస్వామి దేవస్థాన అనుబంధ ఆలయమైన శివాలయం కిక్కిరిసిపోయింది.
అలాగే, ఉభయ జిల్లాల్లోని ప్రముఖ శివాలయాల్లో మహా న్యాస, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకాలతో పూజలు ప్రారంభమయ్యాయి. కొత్తగూడెం, భద్రాచలం, అశ్వారావుపేట, ఇల్లెందు, మణుగూరు ప్రాంతాల్లో శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తులసి, ఉసిరి, మారేడు చెట్ల కింద మహిళలు భక్తిశ్రద్ధలతో దీపాలు వెలిగించి భక్తిభావాన్ని చాటుకున్నారు.
అయ్యప్ప, భవానీ మాలధారులు ప్రత్యేక పూజలు చేశారు. కూసుమంచి శివాలయానికి ఖమ్మంతోపాటు సూర్యాపేట, మహబూబాబాద్, కృష్ణా జిల్లా, హైదరాబాద్ జిల్లాల భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. తెల్లవారుజామున 4 గంటల నుంచి ప్రత్యేక అభిషేకాలు చేశారు.
-భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ భద్రాచలం/ కూసుమంచి, నవంబర్ 15